సజావుగా పది పరీక్షలు జరిపించాలి..


Ens Balu
7
Srikakulam
2022-04-29 11:50:56

శ్రీకాకుళం జిల్లాలో సజావుగా పదవ తరగతి పరీక్షలు  జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా శుక్రవారం పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో జలుమూరు మండలం చల్లవాని పేట జిల్లా పరిషత్ హైస్కూల్, శ్రీకాకుళం మునసబు పేట గురజాడ విద్యా సంస్థలలో  నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్వయంగా పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షలు 248  కేంద్రాలను జరుగుతున్నా యని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 50 మంది రూట్ అధికారులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరి,తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి  బస్సులను ఏర్పాటుచేయడం  జరిగిందన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.