సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ను ఆదాయ వనరుగా అభివృద్ధి చేయడం పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత తెలియచేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ గ్రామం వెంకటనగర్ లోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సేంద్రియ వ్యర్థాలతో నిర్వహిస్తున్న ఈ యూనిట్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎరువులు అత్యంత నాణ్యమైన ఎరువుగా పేర్కొన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. సరైనమార్కెటింగ్ సౌకర్యం లేదని అధికారులు వివరించారు. మొత్తం జిల్లాలో నిర్వహిస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ద్వారా వస్తున్న ఉత్పత్తి పై సమగ్ర నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన జిల్లాలోని లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని హార్టికల్చర్ శాఖ ద్వారా వినియోగం లోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. వీటిని వినియోగంలోకి తీసుకుని రావడం వలన దిగుబడిపెరగడమే కాకుండా ఖర్చుకూడాతక్కువఅవుతుందని తెలిపారు. త్వరలోనే సంబంధించిన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 60 రోజులకు , రెండు నుంచి మూడు టన్నుల ఉత్పత్తి అవుతోందని వివరించారు.