జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి..


Ens Balu
7
Parvathipuram
2022-04-30 08:14:34

పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుత వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కడా తలెత్తరాదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు గ్రామాల్లో ఉదయం పూట పర్యటన జరపాలని ఆయన ఆదేశించారు. తాగు నీటి ఎద్దడి -  వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మునిసిపల్ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉన్నా ప్రతి అంశాన్ని పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉన్న నీటి వసతులు, వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని తనిఖీ చేయాలని పేర్కొన్నారు. గ్రామంలో పలు నీటి వసతులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఒకే బోరుపై ఆధారపడుతున్నప్పుడు మిగిలిన బోర్ల పరిస్థితిని తనిఖీ చేయాలని ఆయన అన్నారు. నీటిని ల్యాబ్ కు పంపించి  నివేదికలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నీటిని పరీక్షించాలని, క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి మండలంలో నీటి తీవ్రత ఉన్న గ్రామాలను ముందుగానే పరిశీలించి జాబితాలను తయారు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు నీటి ఎద్దడిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా తాగు నీరు అందని పరిస్థితి తలెత్తితే దగ్గర్లో ఉన్న నీటి వసతి నుంచి తాగునీటి సరఫరా చేయుటకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటిని నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఫిల్టర్  చేయాలని ఆయన స్పష్టం చేశారు. వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో విస్తృత పర్యటనతో పాటు ఇతర విభాగాల ద్వారా సమాచారం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మండల స్థాయిలోనూ సమాచారం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.  జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం శాఖాపరమైన వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా ఆరోగ్య ఉప ఇంజినీరింగ్ అధికారి విజయ్ కుమార్ సంభందిత అధికారులు పాల్గొన్నారు.