జాతీయ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోండి..
Ens Balu
3
Srikakulam
2020-09-18 13:48:19
భారత ప్రభుత్వం మైనారిటీ వర్గాల విద్యార్ధిని, విద్యార్ధులకు అందించే జాతీయ ఉపకార వేతనాల కొరకు వచ్చే నెల 31 లోగా నమోదు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎమ్.అన్నపూర్ణమ్మ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధులు, జైనులు, సిక్కులు, పార్శీకుల విద్యార్ధినీ విద్యార్ధులు నేషనల్ స్కాలర్ షిప్ పొందుటకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 1 నుండి 5వ తరగతి విద్యార్ధులకు ఏడాదికి రూ.1,000/-లు, 6 నుండి 10వ తరగతి విద్యార్ధులకు రూ.5వేలు, 11,12 తరగతి విద్యార్ధులకు రూ.6వేలు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు రూ.6వేల నుండి 12వేలు, వృత్తి విద్యా సాంకేతి విద్యార్ధులకు రూ.25 వేల నుండి రూ.30 వేలు స్కాలర్ షిప్ పొందవచ్చని ఆమె చెప్పారు. 1 నుండి 10వ తరగతి విద్యార్ధుల కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు, ఆ తదుపరి విద్యార్ధులకు రెండు లక్షల రూపాయలు, వృత్తి విద్యా సాంకేతిక విద్యార్ధులకు రెండున్నర లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండాలని ఆమె చెప్పారు. ఉపకార వేతనం పొందు విద్యార్ధులు ముందు తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని ఆమె స్పష్టం చేసారు. అర్హత గల విద్యార్ధినీ విద్యార్ధులు www.scholarships.gov.in వెబ్ సైట్ నందు అక్టోబర్ 31లోగా నమోదు చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు. ఇతర వివరాల కొరకు దుర్గా ప్రసాద్, జూనియర్ సహాయకులు 82475 54334, సూర్యనారాయణ, జూనియర్ సహాయకులు 94403 99588 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని ఆమె ఆ ప్రకటనలో వివరించారు.