ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం
Ens Balu
3
Kakinada
2022-04-30 10:17:24
గ్రామ సచివాలయ స్థాయిలోని వైఎస్సార్ హెల్త్ క్లినిక్ దగ్గరి నుంచి జిల్లాస్థాయి ఆసుపత్రి వరకు ప్రతి దాంట్లోనూ అందుబాటులో ఉన్న మానవ వనరులు, మౌలిక వసతులను సమర్థంగా ఉపయోగించుకుంటూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలు; ఆసుపత్రుల ద్వారా అందుతున్న సేవలు, వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం, 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు, సీజనల్ వ్యాధులు, వైద్య నిపుణుల నియామకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 37 గ్రామీణ, 23 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు; 465 వైఎస్సార్ ఆరోగ్య క్లినిక్‌లు, సీహెచ్‌సీలు, ఏహెచ్, జీజీహెచ్‌ల తదితరాల ద్వారా జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆసుపత్రులకు సమకూరుతున్న ఆధునిక పరికరాల వినియోగానికి సుశిక్షుతులైన సిబ్బంది ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని.. స్కానింగ్ కేంద్రాల్లో డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యిమందికి ఒకటి చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 2,500 మందికి ఒకటి చొప్పున ఈ కేంద్రాలు ఉన్నందున వీటిద్వారా విస్తృత ఆరోగ్య సేవలు అందించేలా క్షేత్రస్థాయి సిబ్బంది కృషిచేసేలా చూడాలన్నారు. ఏఎన్ఎం, ఆశాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని.. నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పీహెచ్‌సీల్లో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా. బి.మీనాక్షి, డీసీహెచ్ఎస్ డా. పి.బి.విష్ణువర్థిని, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డా. పి.రాధాకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. రమేష్, ఆర్బన్ డీపీవో డా .మహేష్ తదితరులు హాజరయ్యారు.