భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని వేర్వేరు ప్రాంతాల భక్తులు అనేక రూపాల్లో కొలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఒరిస్సా బరంపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం తరలివచ్చారు. వీరంతా తొలుత వరహ పుణ్య పుష్కరిణి వద్దకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ ఫల పుష్పాదులతో పానకాలతో విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం భక్తులందరినీ ఒడిస్సా భక్తబృందం ప్రతినిధి కామ ఆశీర్వదించారు.
భక్తులంతా సాష్టాంగ నమస్కారం చేస్తే వారి పెద్ద కామ కర్రతో వీపు వైపు కొట్టి స్వామి చల్లగా చూడాలని దీవించారు. తాము ప్రతియేటా చందనోత్సవం కు ముందు రోజు వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది సుమారు 300 మంది భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకున్నామని కామ తెలిపారు.
అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు పుష్కరణి వద్ద ఒడిషా భక్తులకు అవసరమైన సదుపాయాలను పర్యవేక్షించారు. అంతే కాకుండా ఆయన వారితో పాటు పూజాది కార్యక్రమాల్లో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒడిశా భక్తబృందం నుంచి శ్రీను బాబు ఆశీర్వాదం పొందారు.