ఫిష్ ఆంధ్ర నిర్వాహకులకు ప్రోత్సాహం
Ens Balu
7
Vizianagaram
2022-05-05 05:37:39
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫిష్ ఆంధ్ర పథకంలో భాగంగా మినీ రిటైల్ యూనిట్లను నడుపుతున్న నిర్వాహకులకు తగిన ప్రోత్సాహం అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. నిర్వహణకు తగిన సామగ్రి, సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు, లబ్ధిదారులతో ఆమె తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిష్ ఆంధ్ర యూనిట్ల ద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుందని, కావున వాటి నిర్వహణకు ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. రోజూ తాజా చేపలను సంబంధిత యూనిట్లకు హబ్ ల ద్వారా సరఫరా చేయాలని చెప్పారు. చేపల వినియోగాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, వీలుంటే సమీప వసతి గృహాల్లో మెనూలో అమలు చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అదనంగా మరిన్ని యూనిట్లను ప్రారంభించాలని, ఔత్సాహికులంటే గుర్తించి యూనిట్లు కేటాయించాలన్నారు. కేంద్రాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని అందజేయాలని చెప్పారు. ఔత్సాహికుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతి మండల కేంద్రంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసేలా చూసుకోవాలని ఫిషరీస్ విభాగం ఉప సంచాలకులను ఆదేశించారు.
ప్రతి యూనిట్‌కు ఇన్వర్టెర్ అందజేయండి..
వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ప్రతి యూనిట్టుకు ఇన్వర్టెర్ అందజేయాలని హబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ కోతల వల్ల చేపలు పాడైపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు నష్టం వాటిల్ల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నెలకొల్పిన కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఇన్వర్టెర్ అవసరమో గుర్తించి త్వరితగిన అందించాలని చెప్పారు. సమావేశంలో మత్సశాఖ విభాగం ఉప సంచాలకులు నిర్మలా కుమారి, డీఆర్డీఏ పీడీ అశోక్ కుమార్, మెప్మా పీడీ సుధాకర్, ఫిష్ ఆంధ్ర రాష్ట్ర కో-ఆర్డినేటర్ హరేరామ్, జిల్లా కో-ఆర్డినేటర్ కృష్ణ, ఇతర అధికారులు జగన్ మోహన్, భాస్కర్ రావు, హరిశ్చంద్ర, యూనిట్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.