పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందించి.. ఆ కుటుంబాలు అన్ని విధాలా అభివృద్ధి సాధించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప మనసుతో జగనన్న విద్యా దీవెన (జేవీడీ) పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022, జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తిరుపతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద సమావేశమందిరం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ దవులూరి దొరబాబు, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రళాదీప్తి తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎంపీ, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, జాయింట్ కలెక్టర్, మేయర్, కుడా ఛైర్‌పర్సన్ తదితరులు అధికారులతో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకం కింద కాకినాడ జిల్లాలో 2022, జనవరి-మార్చి త్రైమాసికానికి 47,347 మంది విద్యార్థులకు సంబంధించి 42,075 మంది తల్లుల ఖాతాల్లో రూ. 29.59 కోట్లు మొత్తాన్ని జమచేయడం జరగుతుందన్నారు. ఒక క్యాలెండర్ ప్రకారం చెప్పిన సమయానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యారంగ ప్రాధాన్యాన్ని గుర్తించి ఓ సమగ్రమైన విధానంతో ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: జేసీ ఇలక్కియ
కాకినాడ జిల్లా కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత చదువులు చదివి భవిష్యత్ కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగలక్ష్మీదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి కె.మయూరితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.