విశాఖజిల్లాకు విద్యాదీవెన రూ.32.36 కోట్లు


Ens Balu
11
Visakhapatnam
2022-05-05 14:21:35

జగనన్న విద్యా దీవెన క్రింద జిల్లాకు రూ.32.36 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యా దీవెన సభలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2021 - 22 ఏడాదికి సంబంధించి రెండువ విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయంను  విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.   జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి  జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లికార్జున, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, గాజువాక ఎమ్.ఎల్.ఎ తిప్పల నాగిరెడ్డి, ఎమ్.ఎల్.సి వరుదు కళ్యాణి, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ రమణమూర్తి, జిల్లా బి. సి  సంక్షేమ అధికారి శ్రీదేవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం జిల్లా కలక్టర్ విలేకరులతో  మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన క్రింద రాష్ట్రంలో 10.85 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  రూ.709 కోట్లు జమచేయడం జరిగిందన్నారు. ఎవరైన అర్హత కలిగి ఉన్న విద్యార్థుల తల్లులకు నగదు  జమ కాకపోతే సోమవారం నాడు జరిగే గ్రీవెన్సులో ఫిర్యాదు చేసినచో వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా వెంటనే విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. 

విశాఖ జిల్లాలో 46,519 మంది విద్యార్థులకు సంబంధించి తమ తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.32.36 కోట్లు జమ. ఇందులో 4,677 మంది ఎస్.సి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.3.95 కోట్లు, 190 మంది ఎస్.టి విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.13.01 లక్షలు, 40,149 మంది బి.సి వెల్ఫేర్  విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ. 27.24 కోట్లు, 1273 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లుల ఖాతాల్లో రూ.83.73 లక్షలు, 230 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు గాను వారి తల్లులు ఖాతాల్లో రూ.18.92 లక్షలు జమ అవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినీ,విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.32.36 కోట్ల  రూపాయల మెగాచెక్ జిల్లా కలెక్టర్, మేయర్,ఇతర ప్రజాప్రతినిధులు అందజేశారు.