స్పందన కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వెంట వెంటనే పరిష్కరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ స్పందనకు అధికారులందరూ సకాలంలో హాజరు కావాలన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎన్నో వ్యయ ప్రయాశాలకు ఓర్చి,ఎంతో దూరం నుండి వస్తారని అటువంటి వారిని నిరుత్సాహ పరచకుండా వారి సమస్యను పరిశీలించి పరిష్కరించాలని హితబోధ చేశారు. స్పందనలో ఫిర్యాదు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం జరిగిన స్పందనకు 84 దరఖాస్తులు అందాయి. వాటిలో ముఖ్యoగా పెదబయలు మండలం మారడపల్లి గ్రామంలో బి.టి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తొలగించిన తెల్ల రేషన్ కార్డును పునరుద్దరించాలని, గంపరాయి నుండి జామిగూడ వరకు ఐదు కిలోమీటర్ల మట్టి రోడ్డును శ్రమ దానంతో వేయించుకున్నామని దానిని బి.టి. రోడ్డుగా వేయించాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయి.
సొవ్వ పంచాయతీ తారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సి.పి.ఐ.ఎం. డుంబ్రిగుడ మండల కమిటీ ఫిర్యాదు చేసింది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగం కొరకు కొంతమంది దరఖాస్తు చేసియున్నారు. మూడు సంవత్సరాల నుండి జీతం రావటం లేదని ఒక ఆశ కార్యకర్త ఫిర్యాదు చేసింది. పాఠశాలకు భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కల్పించనందున ఉద్యోగం కల్పించాలని దరఖాస్తులు అందాయి. ఈ స్పందన కార్యక్రమం లో సుబ కలెక్టర్ అభిషేక్, డిఆర్ఓ దయానిధి, గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు మణి కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.