కస్తూరిభా విద్యాలయంలో ప్రవేశాలు


Ens Balu
1
Vizianagaram
2022-05-06 11:25:04

క‌స్తూరిభా గాంధీ బాలికా విద్యాల‌యాల్లో 6,7,8 త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు అర్హ‌త గ‌ల వారినుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా స‌మ‌గ్ర శిక్ష ఛైర్మ‌న్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కెజిబివిల్లో ప్రవేశాల కొరకు, అర్హులైన విద్యార్ధినులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల‌కు అనుగుణంగా,  కేజీబీవీల్లో దరఖాస్తులు కోరడం జరుగుతుంది ఆమె తెలిపారు. ఈ 2022-23 విద్యా సంవత్సరానికి గాను, జిల్లాలోని కెజిబివిలలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలతో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భ‌ర్తీకి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఇందులో భాగంగా, బ‌డిబ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌ను,  జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక అధికారి ఆధ్వర్యంలో జిసిడిఓ, అసిస్టెంట్ జిసిడిఓలతోపాటు జిల్లాకు చెందిన కేజీబివి పాఠశాల ప్రిన్సిపాళ్లు గుర్తించి, వారిని కెజిబివీల్లో  చేర్పించేందుకు కృషి ఆదేశించారు. అలాగే బ‌డి బ‌య‌ట ఉన్న పిల్ల‌ల‌తోపాటు,  డ్రాపౌట్స్, అనాధ, అర్ధ అనాధ, పి.హెచ్.సి విద్యార్థులకు ఈ పాఠ‌శాల‌ల్లో ముందుగా అవకాశం కల్పించాలని సూచించారు. అనంతరం ఎస్.సి, ఎస్.టి, ఓ.బి.సి, మైనారిటీ వ‌ర్గాలు, పేద పిల్ల‌ల‌కు ఎంపిక‌లో ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌ని చెప్పారు. కెజిబివి లలో దరఖాస్తుల కోసం అభ్యర్ధులు https://apkgbv.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇత‌ర‌ వివరాల కోసం, జిల్లా జిసిడిఓ 9000204925, అసిస్టెంట్ జిసిడిఓ 9440160049 లను సంప్రదించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఉన్న కెజిబివిల ప్రిన్సిపాళ్లంద‌రూ,  దరఖాస్తుల స్వీకరణలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీట్లను భర్తీ చేయాలని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.