పిల్లలను అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలి


Ens Balu
7
Visakhapatnam
2022-05-06 13:58:09

శిశు గృహం ద్వారా నిత్యం పిల్లలను జాగ్రత్తగా సంరక్షించవలసిన  ఆవశ్యకత ఉందని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం మర్రిపాలెంలోని ప్రత్యేక దత్తత  సంస్థ ను (శిశు గృహ) మంత్రి సందర్శించారు. అనంతరం అక్కడి సిబ్బంది వివరాలు మరియు  వివిధ రికార్డులను పరిశీలించారు. శిశు గృహ లోని మౌళిక వసతులు,  పిల్లలు కోసం నిర్వాహకులు అందిస్తున్న వివిధ సేవలకు సంభందించిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ శిశు గృహ  పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత గురించి ఆదేశాలు జారీచేసినట్టు చెప్పారు. ఇటీవల శిశు గృహ నుండి తప్పిపోయిన  ముగ్గురు పిల్లల సంఘటనల లాంటివి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా చూడాలని  సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కె జి హెచ్ లోని ఒన్ స్టాఫ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి సిబ్బంది నుండి  ఈ ఏడాది ఆసుపత్రిలో చేరిన వివిధ మహిళలు, బాలికలకు సంబంధించి నమోదు చేసిన  కేసుల వివరాలు, పురోగతిని గురించి సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. బాధిత మహిళలు,  బాలికలకు సత్వర సేవలు అందేలా చర్యలు చేపట్టాలని అక్కడి సిబ్బందికి సూచనలు, పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తప్పిపోయిన పిల్లలను శిశు గృహ లో చేర్చుకొని  కాసేవు వారితో ముచ్చటించి  పిల్లలతో కలిసి భోజనం చేసారు. అనంతరం కొత్త జాలారిపేటలో గల అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు  అన్న ప్రాసన చేసిన అనంతరం గర్భిణీ స్త్రీలకు  శ్రీమంతం  కార్యక్రమాలను నిర్వహించి వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ కిట్లను  పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో  శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి,  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సీపిసీఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, రీజినల్ ఆర్గనైజర్ మంతెన మాధవీ వర్మ,  ఆర్జేడీ జి.చిన్మయి దేవి,  ప్రోజెక్ట్ డైరెక్టర్ కె.వి.ఎల్.పద్మావతి,  జిల్లా బాలల సంరక్షణాధికారి ఎ.సత్యనారాయణ, సంబందిత అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.