సచివాలయ నిర్మాణాలు పూర్తిచేయాలి


Ens Balu
2
Anakapalle
2022-05-06 15:50:36

అనకాపల్లి జిల్లాలో గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు , రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు రవి పట్టంశెట్టి పంచాయతీ రాజ్ శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ   గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్ లు మరియు రైతు భరోసా కేంద్రాలనిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. వివిధ దశల్లో వున్న నిర్మాణాల స్థాయిని మెరుగు పరుస్తూ వుండాలన్నారు.   జిల్లాలో సాంకేతిక సమస్యలను వేగంగా పరిష్కరించు కోవాలన్నారు.  సమస్య గుర్తించి వెంటనే పరిష్కరించి నట్లయితే నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతాయన్నారు.  నిర్మాణాల కు అవసరమైన మెటీరియల్ మరియు స్థలం సమస్యలు  ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నిర్మాణాల ప్రగతిపై ప్రతి బుధవారం సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు. జూలై 31 నాటికి గ్రామ సచివాలయాలు , విలేజ్ హెల్త్ సెంటర్ ల నిర్మాణాలు మరియు ఆగస్ట్ 31 నాటికి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ కె. వీరం నాయుడు, డిఈ లు, ఏఈ లు  తదితరులు పాల్గొన్నారు.