తాను అనుకున్నది సాధించేవరకూ విశ్రమించని భగీరథ మహర్షి, అకుంఠిత దీక్షకు ప్రతిరూపమని, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత తమ లక్ష్య సాధనకు, భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహర్షి భగీరథ జయంతి కార్యక్రమం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆద్వర్యంలో, కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డిఆర్ఓ గణపతిరావు మాట్లాడుతూ, మన పురాణాలు, ఇతిహాసాలు, మన సంస్కృతీ సంప్రదాయాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఎంతో ఘనమైన వారసత్వ సంపద మన సొంతమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను కొనసాగించేందుకు ఇలాంటి మహనీయుల జయంతులు దోహదపడతాయని చెప్పారు. అలుపెరగని పోరాటం, ఓటమి ఎరుగని దీక్ష భగీరథ మహర్షి సొంతమని, జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డిబిసిడబ్ల్యూఓ డి.కీర్తి మాట్లాడుతూ, సగర, ఉప్పర కార్పొరేషన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం భగీరథ మహర్షి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. సగర వంశానికి చెందిన భగీరథుడు, పట్టుదలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. తన పూర్వీకులకు సద్గతులను ప్రాప్తించేందుకు, ఆకాశ గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథుడని కొనియాడారు. తన వంశం కోసం, సమాజం కోసం పవిత్ర గంగను మనకు అందించారని అన్నారు.
మెప్మా పిడి సుధాకరరావు మాట్లాడుతూ, ప్రతీ చారిత్రక పురుషుడినుంచీ మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. మన దేశ చరిత్ర సుసంపన్నమైనదని, ఆదర్శప్రాయమైన జీవన విధానానికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. తమ పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తిని కల్గించేందుకు కృషి చేసిన భగీరథ మహర్షి చరిత్రను, దాని ప్రాసశ్త్యాన్ని వివరించారు. విలువతో కూడిన జీవన విధానానికి, మంచి నడవడికకు మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి మన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి మూలాలు అన్నీ మన వేదాలు, పురాణాల్లోనే ఉన్నాయని, వాటినుంచి మనం స్ఫూర్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, బిసి సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.