తలస్సేమియా సెంటర్ ప్రారంభించిన గవర్నర్


Ens Balu
11
Paderu
2022-05-08 13:36:25

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రిలో తలస్సేమియా సెంటర్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం వర్చువల్ విధానంలో రాజ్ భవన్ దర్బార్ హాల్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో తల సేమియా తో బాధపడే గిరిజనులకు ఉచితంగా రక్తం సరఫరా చేయాలని సూచించారు.  జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేయాలని, అవసరమైన రక్తం నిల్వలను రెడ్  క్రాస్  బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 250 యూనిట్లు వరకు అన్ని గ్రూపులకు చెందిన రక్త నిల్వలు ఉన్నాయన్నారు. అయితే రక్తాన్ని అవసరం మేరకు వినియోగించి ప్రాణాలు కాపాడాలని సూచించారు.  అదేవిధంగా కళాశాలలు, గిరిజన ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రక్తదానాన్ని ప్రోత్సహించాలని, అవసరానికి మించి రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రక్త దానం ప్రాణ దానంతో సమానమని, ఎటువంటి అపోహలకు లోను కాకుండా రక్త దానానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, రెడ్ క్రాస్ కార్యదర్శి రాజు, ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ గౌరిశంకర్, పలువురు వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.