అసని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆసుపత్రుల వద్ద, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్దా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పలు అంశాలపై ఆమె సమీక్షించారు. చేపల వేటకు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేశారో లేదో పరిశీలించుకోవాలని, ఇంకా ఎవరైనా ఉండిపోతే తక్షణమే తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ డీడీని ఆదేశించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదరకరంగా ఉండే హోర్డింగులను తొలగించాలని లేదా గట్టిగా కట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. తీర ప్రాంత ప్రజలను తుఫానుపై అప్రమత్తం చేయాలని సురక్షిత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ సూర్యకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్ని విభాగాల అధికారులకు సూచించారు. ఆయా విభాగాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సచివాలయ ఉద్యోగుల్లో మనోధైర్యం నింపాలని, ప్రధానంగా నైతిక విలువల ప్రాధాన్యత తెలియజేయాలని కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు. ఎస్. కోటలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు సచివాలయాల సందర్శనలో అక్కడ పరిస్థితులను గమనించాలని సూచించారు. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు నమోదు చేసిన వివరాలను తదుపరి అధికారి పరిశీలించటం లేదని ఫలితంగా పనుల్లో జాప్యం జరుగుతుందని దృష్టి సారించాలని చెప్పారు. స్పందన పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీపీఎం పద్మావతి, డీఆర్డీఏ పీడీ అశోక్ కుమార్, సీపీవో విజయకుమార్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.