విద్యార్థుల ఉన్నత విద్యకు వివిధ సర్టిఫికేట్ లు అవసరమని, వాటిని సత్వరమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలు పై సమీక్ష నిర్వహిస్తూ ఇంటి నిర్మాణ పనులు, వివిధ దశలలో వేగవంతం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గృహనిర్మాణ పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఈ పథకం అమలులో, లక్ష్యాలను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక్క గృహం కూడా గ్రౌండింగ్ కాకపోవడంపై ప్రశ్నించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్, రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రతి అధికారి నిర్మాణాల పై బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలన్నారు.
ఉపాధి హామీ రోజువారీ లక్ష్యాలను, పంచాయతీ వారీగా నిర్దేశించుకుని పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజు కీలకమేనని, ఒక్క రోజు కూడా వృధా చేయకుండా లక్ష్యం మేరకు పని చేయాలన్నారు. పంచాయతీ రాజ్ ద్వారా చేపట్టిన పనులకు పెండింగ్ బిల్స్ ను వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమగ్ర భూ సర్వే గ్రామ సదస్సులు నిర్వహించాలని, గ్రామస్తులకు ముందుగానే సర్వేపై అవగాహన కల్పించాలన్నారు. భూ మ్యుటేషన్ కాలపరిమితి వరకు వేచి ఉండకుండా, వెంటనే పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ మాట్లాడుతూ సర్వేకు ముందుగానే మ్యుటేషన్ పూర్తిచేయాలని, లేనిచో సర్వే సమయంలో తప్పనిసరిగా మ్యుటేషన్ చేయాలన్నారు. డిజిటల్ సంతకం పెండింగ్ పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా అధికారులు హాజరయ్యారు.