పరిశుభ్రతకు తొలి అడుగుపడింది..
Ens Balu
5
Parvathipuram
2022-05-10 05:56:41
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పరిశుభ్రతకు అడుగు పడింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలవారక ముందే సైకిల్ పై పట్టణమంతా చుట్టుముట్టారు. పట్టణంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుధ్యం నుండి జాతీయ నాయకుల విగ్రహాల నిర్వహణ వరకు పరికించి చూసారు. జాతీయ నాయకుల విగ్రహాలు దూలి పట్టి ఉండటం చూసి చలించి పోయారు. స్వామి వివేకానంద విగ్రహాన్ని స్వయంగా శుభ్రం చేసి స్ఫూర్తిని నింపారు. జాతీయ నాయకుల విగ్రహాలను గౌరవించడం మన విధి అని చెప్పకనే చెప్పారు. పట్టణంలో పలు అంశాల నిర్వహణ పట్ల తక్షణం చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలంను ఆదేశించారు. మునిసిపల్ కమీషనర్ సైతం వెంటనే స్పందిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలులో పెట్టుటకు చర్యలు చేపట్టారు. మంగళ వారం పట్టణంలో మరింత పరిశుభ్ర వాతావరణం నెలకొంది. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రపరిచారు. జిల్లా కలెక్టర్ పట్టణంలో పర్యటించడం, వెను వెంటనే విగ్రహాలు శుభ్రపడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పట్టణంలో పారిశుధ్యం, మురుగు నీటి కాలువల కష్టాలు తొలగి పోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పట్టణం పొలిమేరల్లోని ఆవాసాల్లో విద్యుత్ కష్టాలు తొలగించుటకు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.