ఉన్నత సమాజనిర్మానానికి విద్య ప్రధానం


Ens Balu
9
Srikakulam
2022-05-10 10:36:00

విలువ‌లున్న విద్య‌తోనే ఉన్న‌త స‌మాజ నిర్మాణం సాధ్య‌మని, అందుకు వైస్సార్  స‌ర్కార్ నిరంత‌రం ప‌నిచేస్తోందని, పరిత‌పిస్తోంద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. స్థానిక బాపూజీ క‌ళా మందిర్ లో జ‌గ‌న‌న్న విద్యా దీవెన, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌కి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌దస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నాణ్య‌మైన విద్య‌తోనే స‌మాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయ‌ని, త‌ద్వారా దేశాభ్యున్న‌తి సాధ్య‌మ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యారంగంలో మెరుగైన అవ‌కాశాలు అంద‌రికీ వ‌ర్తించే విధంగా ప‌నిచేస్తోంద‌ని, అందుకు త‌గ్గ ఆర్థిక స్థోమ‌త  క‌ల్పించేందుకు అధిక మొత్తం వెచ్చిస్తోంద‌ని చెప్పారు. చదువుకునే అవకాశం లేని సమాజం ఎంత మాత్రం ముందున్న కాలంలో ఎవ‌రి ఆమోద యోగ్యత‌నూ సాధించ‌దు అని అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి విద్యార్థులు ఉంటే, వారే బలమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించ‌డం త‌థ్యం అని అన్నారు. ఉన్న‌త విద్య ఉంటేనే మేలిమి రీతిలో సమాజం, తద్వారా రాష్ట్ర నిర్మాణం ప్ర‌గతి దిశ‌గా సాగ‌నుండ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.


దేశంలో అన్ని రాష్ట్రాల‌లో కంటే పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే వెచ్చిస్తున్నాం అని, విశాలమైన భావజాలం కలిగి ప‌థ‌కాల అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. సాంకేతికంగానూ, సామాజికంగానూ శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తున్న ప్రపంచంతో పోటీ ప‌డేందుకు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ మధ్యమాన్ని ప్ర‌వేశపెట్టాం అని, పేద పిల్లలంద‌రూ ఉన్నత విద్యా ఫ‌లాలు అందుకోవాల‌ని, బాగా చదువుకోవాలని, ఆ ఉద్దేశం మ‌రియు దృక్ప‌థంతోనే అర్హుల‌యిన వారంద‌రికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నామ‌ని చెప్పారు. 69 వేల మందికి జిల్లాలో వసతి దీవెన అందిస్తున్నామని, అదేవిధంగా విద్యా దీవెన పేరిట కూడా అర్హులంద‌రికీ ఆర్థిక ల‌బ్ధి అందుతోంద‌ని అన్నారు. వారంద‌రికీ త‌మ ప్ర‌భుత్వం త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు చెబుతూ ప్ర‌సంగం ముగించారు.

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ రామన్, ఎంఆర్వో వెంకటరావు,తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు,  మాజీ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ మెంటాడ వెంక‌ట పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్య,  ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి నిర్మలా శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు అంబటి శ్రీనివాస రావు, గొండు కృష్ణ, చల్లా శ్రీనివాసరావు, సాధు వైకుంఠ రావు, మూకళ్ల తాత బాబు, డాక్ట‌ర్ పైడి మహేశ్వరరావు, ముంజేటి కృష్ణ, ప్రకాశ్, మార్పు పృధ్వి, సీజు చల్లా అలివేలు మంగ,  ఎం.మహాలక్ష్మి, సుగుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.