అసని తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అసని తుఫాన్ పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాధిక, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ రానున్న అసని తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోరా వేయించడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని యంత్రాంగానికి ఆదేశించామని తెలిపారు. జిల్లా,మండల,గ్రామ స్థాయి అధికారులు , సిబ్బంది అందరూ అందుబాటులోనే ఉన్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని 08942- 240557 నెంబర్ కు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే తీర ప్రాంత మండలాలలో తుఫాన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పటు చేయడం జరిగిందన్నారు. మండల స్థాయి అధికారులు వాలంటీర్ల సేవలను వినియోగించు కావాలన్నారు. జిల్లాలో 21 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 721 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను, వృద్ధులను తరలించడం జరిగిందన్నారు. తుఫాన్ షెల్టర్లను లోతట్టు ప్రాంతాల ప్రజలు, వయోవృద్ధులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని తాసీల్దార్లకు సూచించారు.
వైద్య-ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ, ఎస్.ఇ. ఆర్.డబ్ల్యూ. ఎస్ అధికారులు సిబ్బంది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులు కరంట్ స్థంబాలు ఇతర సామగ్రితో తుఫాన్ ప్రభావిత మండలాలలో సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా లో 108 వాహనాలు, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.టి.ఆర్. ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జనరేటర్ల ను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాసీల్దార్ల ను ఆదేశించినట్లు చెప్పారు. అసని తుఫాన్ ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రం రేవుకు వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చిందని, ఆసని తుఫాన్ ప్రభావంతో బంగారు రంగు గల రథం, తీరానికి చేరుకుందని, తీరప్రాంతంలో ఈ రధం పూర్తి భద్రత కల్పించడం జరిగిందన్నారు. మండల తహశీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. వారి నుంచి నివేదికలు వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు.