అసని తుఫాను కారణంగా సంభవించే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుటకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన అన్నారు. అసాని తుఫాను కారణంగా అత్యవసర చికిత్సలు, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడంలో భాగంగా బుధవారం జిల్లా ఆసుపత్రిని సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పరిశీలించారు. తూఫాను తీవ్రత దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉందని అటువంటి సమయంలో శస్త్ర చికిత్సలకు, ఇతర అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్ లు సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు. శస్త్ర చికిత్సలకు అవసరమగు పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచాలని, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆమె పేర్కొన్నారు. అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుఫాన్ వలన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలియజేస్తుందని అటువంటి సందర్భాల్లో జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ తో సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.