మ‌త్స్య‌కారుల జీవితాల్లో వెలుగులే లక్ష్యం


Ens Balu
2
Vizianagaram
2022-05-13 10:13:50

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌నా కాలంలో మ‌త్స్య‌ కారుల జీవితాల్లో వెలుగులు నిండాయ‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. వేట నిషేధ కాలంలో వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందిస్తూ ప్ర‌భుత్వం వారికి అండ‌గా నిలుస్తోంద‌ని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని గుర్తు చేశారు. మ‌త్స్య‌కార భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని కోన‌సీమ జిల్లా ముర‌మ‌ళ్ల నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడిన అనంత‌రం మీట నొక్కి మ‌త్స్య‌కారుల ఖాతాల్లో నేరుగా మీట నొక్కి కుటుంబానికి రూ.10 వేల చొప్పున‌ నిధుల‌ను జ‌మ చేశారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. వేట నిషేధ కాలంలో మ‌త్స్య‌కారుల‌ను ఆదుకునే స‌దుద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ పెట్టార‌ని, ఈ ప‌థ‌కం ద్వారా ఎంతోమంది పేద‌ల‌కు ల‌బ్ధి చేకూరుతోంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో 2,944 కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున‌ రూ.2.94 కోట్ల ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరింద‌ని వివ‌రించారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌లేన‌న్ని మంచి ప‌నులు వైకాపా ప్ర‌భుత్వం చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వ‌ర‌కు ఉండే వేట నిషేధ కాలంలో మ‌త్స్య‌కారుల జీవ‌నోపాధికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింద‌ని చేశారు. మత్స్య‌కారుల‌కు భీమా, బోట్ల‌కు ఆర్థిక స‌హాయం, డీజిల్ రాయితీ క‌ల్పించ‌టంలో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక చొర‌వ చూపించార‌ని పేర్కొన్నారు.

అనంతరం లబ్ధిదారులకు 2.944 కోట్ల విలువ గల మెగా చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ సూర్యకుమారి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరుల చేతుల మీదుగా అందజేశారు.

మ‌త్స్య‌కార భ‌రోసా కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని వీసీ హాలు నుంచి జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, మత్స్య‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మ‌లా కుమారి, ఆ శాఖ ఇత‌ర అధికారులు, మ‌త్స్య‌కార సంఘం నాయ‌కులు బ‌ర్రి చిన‌ప్ప‌న్న‌, న‌ర్శింగ‌రావు, నెడ్ క్యాప్ డైరెక్ట‌ర్ రాజు, మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌క ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.