ప్రపంచం అంత ఒకటే కుటుంబం అని బౌద్ధమతం బౌద్ధులకు మాత్రమే కాకుండా మనందరికి 'వసుధైవ కుటుంబకం' అనే సందేశాన్ని ఇస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి కార్యాలయంలో బౌద్ధ గురువు వేన్ సుమేధా బోధి మంత్రిని కలిసి స్థలం కోసం మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ, ప్రపంచంలో అన్ని సమాజాలు శాంతియుతంగా సహజీవనం చేయడానికి బౌద్ధ మతం మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నదన్నారు. బుధుని బోధనలకు మరియు హిందూ మత బోధనలకు దగ్గరి సంబంధం ఉందన్నారు. బుద్ధుని బోధనలు వలన సాధకుడు జ్ఞానోదయం పొందుటయే గాక సమాజములో మానవత్వం, దయ వంటి సద్గుణములు అభివృద్ధి చెంది శాంతియుత సహజీవనమునకు దోహద పడుతుంది.
ఈ రోజుల్లో, మనకు మతపరమైన ఆచారాలలో విప్లవాత్మక మార్పులు అవసరం. డిజిటల్ యుగానికి అనుగుణంగా సాధన విధానమును ఆచారాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని వేన్ సుమేధా బోధి పేర్కొన్నారు. సాంఘిక, రాజకీయ మరియు ఆర్థిక అంశాలలో మార్పు కారణంగా పురాతన ఆచారాలు మరియు వ్యవస్థలు ఇప్పుడు ఆచరణలో లేవన్నారు. ఒక బౌద్ధ భిక్షువుగా నూతనమైన 'సామాజిక బౌద్ధ ధర్మ' విధానం ద్వారా సమాజంలో మార్పే గాక తప్పుడు మార్గములో ఉన్నవారిని సాధన ద్వారా సంస్కరించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. డా.బీ.ఆర్.అంబెద్కర్ సూచించిన విధముగా సోషల్ జస్టిస్ కోసం కృషి చేస్తామని దమ్మ సోల్జర్ సుమేద బోధి చెప్పేరు. ధవళేశ్వరం లో గాని కొవ్వూరు లో గాని బుద్ధ విహారం తో పాటు కుటీరం నిర్మించడాని కోసం 3 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలని మంత్రిని కోరారు.