విజయనగరం జిల్లాలో ఈ నెల 29 న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరుగుతుందని డి. ఆర్.ఓ గణపతి రావు తెలిపారు. విజయనగరం జిల్లాలోని 10 కేంద్రాల్లో, బొబ్బిలి లో 9, గజపతి నగరం లో 4 కేంద్రాల్లో ఉదయం 10 నుండి 1 గంటవరకు పరీక్ష జరుగు తుందన్నారు. పరీక్ష హాల్ లోనికి ఒక గంట ముందు అనుమతిస్తారని, 11 తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు. విద్యా శాఖ నుండి ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టి లో పెట్టుకొని ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, ప్రధమ చికిత్స కు అవసరమగు మందులను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షల కేంద్రం వద్దకు పరీక్షా సమయం లో అవసరమగు బస్ లను నడపాలని ఆర్.టి.సి వారికీ సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.అన్ని శాఖల సమన్వయం తో పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో పోలీటెక్నిక్ ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల సమన్వయాధికారి విజయలక్ష్మి, డి.ఈ.ఓ కార్యాలయపు ఏ.డి లక్ష్మణ రావు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.