గ్రామ సచివాలయానికి సమయానికి రాకుండా.. ప్రజలకు సంతృప్తికర సేవలందించకుండా నిర్లక్ష్యం వహించే సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను రెడ్ లిస్టులో పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని వసంత విహార్ సచివాలయాన్ని ఆమె బుధవారం ఉదయం 10.15 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సచివాలయ పరిధిలో సేవలు సరిగ్గా అందటం లేదని పరిశీలిద్దామని ఇక్కడికి వచ్చాం.. కానీ ఇక్కడెవరికీ క్రమశిక్షణ ఉన్నట్లు కనిపించటం లేదని కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెళ్లిన అరగంట తర్వాత కూడా కొంతమంది సిబ్బంది రావటంతో వారిని ప్రశ్నించారు. మీకు సమయపాలన లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు కూడా ఎవరూ రాకపోవటంతో పనితీరు ఆధారంగా నివేదికలు తయారు చేయాలని, పనితీరు బాగులేని ఉద్యోగులను, వాలంటీర్లను రెడ్ లిస్టులో పెట్టాలని జిల్లా సచివాలయ కో-ఆర్డినేటర్ అశోక్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి సచివాలయం తాలూక ప్రగతి నివేదికలను పరిశీలించి జాబితా తయారు చేయాలని సూచించారు.
సచివాలయ సందర్శన సందర్భంగా కలెక్టర్ పలు నివేదికలను పరిశీలించారు. బీయాండ్ ఎస్.ఎల్.ఎ. ఎక్కువగా వస్తున్నాయని, నిర్ణీత వ్యవధిలోగా ప్రతి సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. సాంకేతిక పరమైన సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి సత్వరమే పరిష్కరించాలని, కాలయాపన చేయరాదని సూచించారు. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సిబ్బంది హాజరు పట్టికను, ప్రగతి నివేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి పనితీరు బాగులేని వారిని మందలించారు. కార్పరేషన్ పరిధిలో ఉన్న సచివాలయాలను తరచూ సందర్శించాలని స్థానిక మున్సిపల్ అధికారి హరీశ్‌ను ఆదేశించారు. సిబ్బందికి క్రమ శిక్షణ అలవర్చాలని, పనితీరులో ఆశాజనక మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ అశోక్, స్థానిక మున్సిపాలిటీ అధికారి హరీశ్, సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.