ధావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన అన్ని అవకాలను అందిపుచ్ఛుకోవటం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. గురువారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24,25,26 తేదీల్లో ధావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారమ్ సదస్సులో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ సదస్సు 18 అంశాల్లో జరుగుతుందని, అందు 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొంటున్నట్లుగా మంత్రి తెలిపారు. కోవిడ్ కు ముందు జరిగిన సదస్సుల కంటే కోవిడ్ తదుపరి జరిగే ఈ సదస్సులో మార్పు ఉంటుందన్నారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో వనరులు, అవకాశాలను చూపించే వేదికగా వ్యవసాయ, అధునాతన సాంకేతిక అంశాలలో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వనరులకు సంబంధించి ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో ఐటి ను అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా, బీచ్ ఐటి ను ప్రమోట్ చేసే దిశగా సదస్సులో ప్రస్తావిస్తామన్నారు. ఆంద్రప్రదేశ్ లో విశాఖను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని, అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో స్టార్ట్ఆప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వచ్చే సంస్థలకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. విశాఖను రాష్ట్ర ఐటి హబ్ గా తీర్చుదిద్దడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు మల్టీ నేషనల్ కంపెనీ వచ్చిందని, మరికొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు. అదే విధంగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అపూర్వ స్పందన కనిపిస్తుందన్నారు.