మిషన్ నిర్మాణ్ - 2022 పేరిట స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో ఐదు రోజుల పాటు జరగబోయే శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణ పొందేందుకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రారంభోపాన్యాసం చేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విశ్వాసమే ఆయుధంగా నైపుణ్యాలకు పదును పెట్టడం ద్వారా చరిత్ర మెచ్చే విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సమగ్ర శిక్షా పర్యవేక్షణలో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, ఏస్, 21 స్ట్ సెంచరీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భావితరంలో మీరంతా మంచి స్థానాల్లో స్థిరపడడానికి ఇదొక చక్కని వేదికవవుతుందని, తొలి అడుగులు ఇక్కడ నుంచే పడతాయని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి అని అన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. భయం పోవాలని విశ్వాసం పెరగాలని హితవు పలికారు. బిడియం వీడి ధైర్యంగా ఇంగ్లీషు మాట్లాడాలని సూచించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంపై శ్రద్ధ పెట్టి ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా నేర్చుకోవాలని చెప్పారు. సందేహాలను నివృత్తి చేసుకొని, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు పొందాలని సూచించారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం, సెలవులను సద్వినియోగం చేసుకొనేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహకారంతో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్ భరత్ సుబ్రమణ్య అయ్యర్, కేంబ్రిడ్జ్ ప్రజెంటర్ షీతల్ బందేకర్, సివిల్ సర్వీసెస్ సీనియర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ ప్రంపంచంలో మిగతా వారితో పోటీ పడి గెలవాలంటే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం ఉంటే త్వరితగతిన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ వి. అప్పల స్వామినాయుడు, డీఈవో ఎం. జయశ్రీ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, వివిధ పాఠశాలల హెచ్.ఎం.లు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు శిక్షణలో భాగంగా ఆంగ్ల భాష ప్రాముఖ్యతపై, భవిష్యత్తు అవకాశాలపై వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంట్ ద్వారా పలు అంశాలపై విశదీకరించారు. కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్ భరత్ సుబ్రమణ్య అయ్యర్, కేంబ్రిడ్జ్ ప్రజెంటర్ షీతల్ బందేకర్, సివిల్ సర్వీసెస్ సీనియర్ మెంటార్ అనుకుల రాజ్ కుమార్ ఆంగ్ల భాషపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలి.. నేర్చుకుంటే భవిష్యత్తులో లభించే అవకాశాల గురించి సంపూర్ణంగా వివరించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవటం ద్వారా తొలి రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.