మినుములూరుని ఆదర్శంగా తీర్చిదిద్దాలి


Ens Balu
2
Paderu
2022-05-19 09:49:59

మినుములూరు గ్రామాన్ని ప్రజా భాగస్వామ్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ సూచించారు.  గురువారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో 330 గృహాలకు గాను మూడు ట్రై సైకిల్స్, పుష్ కార్టులు ఉన్నప్పటికీ, ఎత్తైన కొండ ప్రాంతంలో గృహాలు ఉన్నందున ఇంటింటికి చెత్త సేకరణ లో కొంత ఇబ్బంది అవుతుందని సర్పంచ్ ఎల్ చిట్టమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  చెత్త సేకరణలో భాగంగా గ్రామానికి అవసరమైన ఆటోలను అద్దెకు తీసుకోమని సూచించిన కలెక్టర్ యువత ఐదు వేల రూపాయలు సేకరిస్తే తన వంతుగా మరో ఐదు వేల రూపాయలు రెండు మూడు నెలల పాటు అందజేస్తామని తెలిపారు.  తద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందన్నారు.  గ్రామంలో యూజర్ చార్జీలు వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్, కార్యదర్శులను కలెక్టర్  కోరారు. నెలకు అరవై రూపాయల యూజర్ చార్జీలు చెల్లించడం ద్వారా చెత్త సేకరణ లో సమస్యలు తొలగిపోతాయని తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని కలెక్టర్ వివరించారు.  గ్రామస్తులతో వెలుగు సిబ్బందిని కలుపుకొని సమావేశమై యూజర్ చార్జీల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వాలంటీర్ తోపాటు, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు, వ్యవసాయ సహాయకులు, మహిళా పోలీస్ తదితర సిబ్బంది 50 ఇళ్ల నుండి కుటుంబీకులను చైతన్య పరిచి యూజర్ చార్జీలు వసూలు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్  ఎరువును తయారు చేసి లబ్ధి పొందాలన్నారు. సామాజిక భాద్యతతోనే అభివృద్ధి సాధ్యమని హితబోధ చేశారు. 

        పారిశుధ్య కార్మికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుగా సేకరించి వాటిని అమ్మి వచ్చిన సొమ్మును  వారే వినియోగించుకోవచ్చని సూచించారు.  పారిశుధ్య కార్మికులకు నెలకు ఒకసారి తప్పనిసరిగా హెల్త్ చెక్ చేయాలని ఆదేశించారు. వారికి గత ఆరునెలలుగా వేతనాలు అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా కలెక్టర్ స్పందిస్తూ.. కమిషనర్, కార్యదర్శిల దృష్టికి తీసుకు వెళ్లి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎల్ చిట్టమ్మ, జిల్లా పంచాయతీ అధికారి పిఎస్ కుమార్, ఎంపీడీఒ కెవి నర్సింహ రావు, ఇఒపిఆర్డి పి విజయలక్ష్మి, కార్యదర్శి బి. చిన్ని, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.