వేసవి శిబిరాలు ఉత్సాహంగా నిర్వహించాలి
Ens Balu
6
Parvathipuram
2022-05-19 09:56:09
పార్వతీపురం మన్యం జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వేసవి క్రీడ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని క్రీడా శిక్షణా శిబిరాలు పక్కాగా నిర్వహించాలని తద్వారా క్రీడల పట్ల యువత ఆసక్తి పెరగుతుందని సూచించారు. చిన్నతనం నుండే అభిరుచి పెరగడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని, మానసికంగా ధైర్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉన్నతమైన శిక్షణ కల్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని సూచించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, క్రీడల శిక్షకులు పాల్గొన్నారు.