నాడు-నేడు 2వ దశ త్వరితగతిన చేపట్టాలి
Ens Balu
6
Kakinada
2022-05-19 11:34:26
కాకినాడ జిల్లాలో నాడు-నేడు రెండో దశ కింద పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో రెండోదశ నాడు-నేడు పనులపై కలెక్టర్ కృతికా శుక్లా.. విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సర్వ శిక్షా అభియాన్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు-నేడు కార్యక్రమం రెండో దశ కింద అదనపు తరగతుల నిర్మాణంతో పాటు మరమ్మతులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం తదితర పనులు మంజూరైనందున.. వెంటనే గ్రౌండింగ్ మొదలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రికి ఇండెంట్ పెట్టాలని.. అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించి, ఇతర సామగ్రి సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు.. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనుల ప్రారంభానికి ఏవైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగించి, గ్రౌండింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. పనుల్లో పురోగతిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఈవో డి.సుభద్ర, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎం.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.