గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు


Ens Balu
5
Pachipenta
2022-05-19 13:03:16

గడపగడపకు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్నదొర అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలం కందిరి వలస గ్రామంలో ఉప ముఖ్యమంత్రి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కనుక్కున్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు. ప్రతి ఇల్లు కనీసం రూ.15 లక్షలు విలువ చేస్తుందని ఆయన పేర్కొంటూ జగన్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉందని అన్నారు. మహిళలకు చేయూత, సున్నా వడ్డీ తదితర కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, పిల్లలకు బాల అమృతం వంటి కార్యక్రమాలను అందిస్తూ పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.

గర్భంలో ఉన్నప్పటి నుండే ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా మొత్తాలను సోమ వారం విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. లబ్దిదారులతో ముఖాముఖీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కందిరివలసలో ఒక వ్యక్తి రూ.2.41 లక్షలు విద్యా దీవెన క్రింద అందిందని, తన కుమారుడిని బి.టెక్ చదిస్తున్నానని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ పేదలకు మేలు చేయుటకు జగన్ మోహన్ రెడ్డి ముందు వరుసలో  ఉంటారని చెప్పారు.