ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలి


Ens Balu
2
Parvathipuram
2022-05-24 06:47:31

ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను ముందుకు తీసుకు వస్తున్న దృష్ట్యా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయితీ లేని విత్తనాల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. పచ్చి రొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాలు వారీగా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు వారీగా విత్తనాల అవసరాలు పక్కాగా గుర్తించాలని ఆయన అన్నారు. విత్తనాల నిలువకు గిడ్డంగుల కొరత ఉంటే ప్రైవేట్ భవనాలలో నిల్వ ఉంచుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విత్తనాల అవసరాలను మూడు రోజులలో జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో విత్తనాల సమస్య తలెత్తరాదని కలెక్టర్ పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ లాబ్ లను త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండలాల్లో కౌలు రైతులను గుర్తించి కార్డులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. గుమ్మలక్ష్మిపురం, సీతంపేట తదితర మండలాల్లో కౌలు రైతుల గుర్తింపులో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

 50 శాతం రాయితీతో పచ్చి రొట్ట విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని, కొన్ని మండలాలకు 90 శాతం రాయితీ ఉందని ఏపి సీడ్స్ జిల్లా మేనేజర్ పద్మ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ విమల, ఏపిఎం.ఐ.పి ప్రాజెక్టు డైరెక్టర్ కె. మన్మథ రావు, ఇన్ ఛార్జ్ జిల్లా మత్స్య శాఖ అధికారి గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.