సచివాలయానికి సమస్యల తో వచ్చేవారికీ సరైన పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరుకు అద్దం పట్టేలా సచివాలయ వ్యవస్థ పని చేస్తోందని, సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియం లో బుధవారం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో నున్న వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతి పాదనలు పంపుతున్నామని, ఉద్యోగులు ఇంకా ఉత్తేజంగా, చిత్తశుద్ధి తో పని చెయ్యాలని అన్నారు. కార్పొరేషన్ పరిధి లో రెవిన్యూ కలెక్షన్ లో, సిటిజెన్ అవుట్ రీచ్ లో ముందున్నామని, అయితే ఇంకా అనేక సేవలలో మెరుగు పడాల్సి ఉందని పేర్కొన్నారు. చేసే పనిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని, అప్పడే పూర్తిగా మనసు పెట్టి చేయగలమని అన్నారు. ఎందరికో రానటువంటి అవకాశం మీకు వచ్చిందని, ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి క్రమ శిక్షణ తో పని చేయాలనీ హితవు పలికారు., పదవి తో సంబంధం లేకుండా శాసన సభ్యులు కోలగట్ల నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలు వారే స్వయంగా పరిష్కరిస్తున్నారని, అందుకోసం వారిని ప్రత్యేకంగా అభినందించాలని అన్నారు. మంచి పని చేసే వారిని ఏ ఒక్కరూ అడ్డుకోరని , ఎంతైనా చేయవచ్చని, అది పది మందికి ఉపరించేలా ఉండాలని అన్నారు. జాబు చార్ట్ లోని పనులే కాకుండా వినూత్నంగా అలోచించి ప్రజలకు మేలు చేసే పని దేనినైనా స్వాగతిస్తామని తెలిపారు.
శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి, పారదర్శకంగా , ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టారని, మీ ప్రతిభను ప్రజా సమస్యల పరిష్కారం లో చూపించాలని అన్నారు. ఎంతో నమ్మకం తో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రారంభించారని, ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించాలని అన్నారు. సచివాలయ వ్యవస్థకు తోడుగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారని , ప్రజలతో మమేకం అయి, అందరిని కలుపుకొని పని చేయాలనీ అన్నారు. పాలన అనేది నిరంతర ప్రక్రియ అని, బాధ్యతాయుతంగా నడిపిస్తే వ్యవస్థ చక్కగా నడుస్తుందని అన్నారు. జిల్లా కలెక్టరు గా చేరిన నుండి సూర్య కుమారి గారు కఠినంగా వ్యవహరిస్తూ అలసత్వాన్ని సహించేది లేదంటూ జిల్లా పాలనను గాడిలో పెట్టారని తెలిపారు. కలెక్టరు, కమీషనర్ మాత్రమే బాధ్యత తీసుకుంటే కుదరదని, ప్రతి ఉద్యోగి వారి బాట లో నడిచి విధి నిర్వహణ లో చిత్తశుద్ధి కనపరచాలని అన్నారు. అంతే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా కలుపుకొని వెళ్ళాలని అప్పుడే ప్రజలకు అవసరమగు సేవలు అవసరమైనపుడు అందుతాయని పేర్కొన్నారు. క్రింది స్థాయి వారితో మాట్లాడడం తక్కువని భావించరాదని, సేవ చేసే అవకాశం రావడమే అదృష్టమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆర్.శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమగు శిక్షణలు అందిస్తూ , వారి సేవల పర్యవేక్షణకు నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేసామన్నారు. ప్రజామోద యోగ్యమైన సేవలందించేలా వ్యవస్థను తీర్చి దిద్దుతామని అన్నారు. సహాయ కమీషనర్ ప్రసాద్ పవర్ పాయింట్ పై సచివాలయ ఉద్యోగుల సేవలు, స్పందన వినతుల పరిష్కారం , ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాల పై వివరించారు. మున్సిపల్ ఇంజనీర్ దిలీప్, ఇతర సెక్షన్ హెడ్స్, ప్లానింగ్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి వచ్చిన సుధీర్ ఈ శిక్షిణా కార్యక్రమంలో మొటివేశనల్ తరగతి నిర్వహించారు.