విజయనగరం జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని సదుపాయాలతో కూడిన అడ్వాన్స్‌డ్ లైఫ్ సేప్టీ సపోర్ట్ అంబులెన్స్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాకు సమకూర్చింది. రూ.30 లక్షల సీఎస్ఎర్ నిధులతో జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్‌ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సౌత్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ముందుగా అంబులెన్స్ లోపల కల్పించిన సదుపాయాలను, ప్రత్యేక వెంటిలేటర్, స్ట్రెచర్, ఆక్సిజన్ మానిటర్ తదితర పరికరాలను కలెక్టర్ పరిశీలించగా దీనిలో కల్పించిన సదుపాయాల గురించి వైద్యులు ఆమెకు వివరించారు. మిగతా వాటికంటే అడ్వాన్స్‌డ్ సదుపాయాలతో కూడిన అంబులెన్స్ అని దీని సహకారంతో త్వరితగతిన సేవలందించవచ్చని, ఆక్సిజన్ బెడ్‌పై ఉన్న రోగులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించవచ్చని చెప్పారు.
అనంతరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈడీ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో కలిసి స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ జెండా ఊపి అంబులెన్స్‌ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో అంబులెన్స్ ను కేటాయించటం అభినందనీయమని, ఈ సందర్భంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారికి ధన్యావాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో రిఫరెల్ కేసులో ఎక్కువగా ఉండే ఎస్. కోట, ఎల్. కోట, కొత్తవలస పరిధిలోని ప్రాంతాల ప్రజలకు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, సీతం కళాశాల యూత్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.