పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మంజూరైన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీఎంఎస్ ఐడిసి ఇంజనీర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, సంబంధిత అధికారులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి ఎదురుగా ఉన్న వెటర్నరీ క్లినిక్ ను సిఆర్పిఎఫ్ బరాక్ వద్దకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. బరాక్ కు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన సూచించారు. పోలీస్ క్వార్టర్స్ కొంత మేర తొలగించాల్సి ఉంటుందని, వాటిని తొలగించి స్థలాన్ని చదును చేసి తక్షణం పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పార్వతిపురంలో 49 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేసిన సంగతి విదితమే. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఐదు విభాగాలతో పాటు వంద పడకలు రానున్నాయి. దీంతో మన్యం జిల్లా కేంద్రంలో ఇప్పటికే మంచి సేవలు అందిస్తున్న జిల్లా ఆస్పత్రికి అదనంగా మరో మంచి మౌలిక వసతి కలగడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలు లభ్యం కానున్నాయి.
దీన్ని త్వరగా నిర్మించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం వైద్య సేవలకు మకుటాయమానంగా నిలవాలని నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లో జిల్లా ఆసుపత్రి తనిఖీలో భాగంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షించడమే కాకుండా వెటర్నరీ క్లినిక్ ను తరలిస్తున్న సిఆర్పిఎఫ్ బారక్ ను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు బరాక్ కు చేపట్టాల్సిన మరమ్మతులపై ఏపీఎంఎస్ ఐడిసి ఇంజినీర్లు పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపీఎస్ఎంఐడిసి పర్యవేక్షక ఇంజినీర్ కె.శివ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ ఏం.సూర్య ప్రభాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసన్న కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.