రీసర్వే, మ్యూటేషన్ సకాలంలో పూర్తి చేయండి


Ens Balu
7
Tirupati
2022-05-26 09:19:34

జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వేను వేగవం తంగా చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లను సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ ఆదేశించారు. గురువారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుండి జగనన్న భూ హక్కు - భూరక్ష పథకం అమలు అంశంలో భాగంగా డ్రోన్ సర్వే, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మ్యూటేషన్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ డీ.కె బాలాజీ, సర్వే అధికారులు పాల్గొన్నారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ మాట్లాడుతూ...భూమి రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని స్వచ్ఛమైన.. శాశ్వత భూమి రికార్డులను రూపొందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లకు సూచించారు. జగనన్నభూ సర్వేపై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలను కారణాలు లేకుండా తిరస్కరించరాదని ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం చేయాలన్నారు. డ్రోన్ సర్వే, భూమి కొలతలు, భూమి హద్దులు  ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మ్యూటేషన్, రీ సర్వే పనుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ సమీక్ష నిర్వహించి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి వివరిస్తూ జగనన్న భూ హక్కు - భూరక్ష పథకంలో భాగంగా  డ్రోన్ సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో 34 మండలాలలో 1050  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అందులో నాలుగు డివిజన్లలో 52 గ్రామాలలో ఇప్పటివరకు డ్రోన్ సర్వే పూర్తిచేశామని, మిగిలినవి నిర్దేశించిన సమయం మేరకు పూర్తి చేస్తామని తెలిపారు.