ఆరోగ్య సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి


Ens Balu
18
Srikakulam
2022-05-31 07:38:39

శ్రీకాకుళం జిల్లాలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది, ఎం.పి.హెచ్.ఇ.ఓలు, ఆడ, మగ సూపర్ వైజర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి సిబ్బందికి తెలియజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో సిహెచ్ఓలు,ఎం.పి.హెచ్.ఇ.ఓలు, సూపర్ వైజర్లతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తగ్గుముఖం పట్టాయని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలలో కూడా వెనుకబడి ఉందని ఆమె స్పష్టం చేసారు. మరో 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక ఆసుపత్రులలో వైద్యాధికారులతో పాటు సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేసారు. ప్రతి సూపర్ వైజర్ ఏఎన్ఎంతో కలిసి తమ పరిధిలో గర్భిణీ స్త్రీల వివరాలను సేకరించి ప్రతి వారం ఐరన్ మాత్రలు అందించాలని, అలాగే వైద్యులు నెలలో ఒకసారి తనిఖీ చేసి వారికి అవరసమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జె.ఎస్.వై ( జననీ సురక్ష యోజన ) మరియు పి.ఎం.ఎం.వి.వై ( ప్రధానమంత్రి మాతృ వందన యోజన ) పథకాల పట్ల గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జననీ సురక్ష యోజన క్రింద గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలకు రూ.1000/-లు, పి.ఎం.ఎం.వి.వై క్రింద రూ.5వేలు ప్రభుత్వం అందిస్తున్న సంగతిని ప్రతి గర్భిణీకి తెలియజేయాలన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వసతుల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేనందునే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని, ఇకమీదట ప్రతి గర్భిణీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునేలా చైతన్యపరచాలని, ఆ దిశగా వైద్యాధికారులు, వైద్యసిబ్బంది కృషిచేయాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు టి.టి ఇంజిక్షన్లు ఇచ్చేలా చూడాలని, బిడ్డ పుట్టిన వెంటనే పోలియో చుక్కలు, హెపటైటిస్ – బి తప్పనిసరిగా వేయాలని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాలంటరీ వ్యవస్థ నేడు ఉందని, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీల వివరాలతో పాటు ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. హెల్త్ సూపర్ వైజర్లు తమ పి.హెచ్.సి పరిధిలో గల గృహాలను సందర్శించి ఎన్.సి.డి ( నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ) పై వివరాలు సేకరించాలని అన్నారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టిన వివరాలు రోజువారీ అందించాలని, లేనిఎడల హాజరుకానట్లుగా పరిగణిస్తామని ఆమె అన్నారు. వచ్చే 10 రోజుల్లో అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అన్నింటా మంచి స్థానంలో నిలిపేందుకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, ఎస్.ఓ నాగేశ్వరరావు, డెప్యూటీ ఎస్.ఓ శ్రీనివాస పట్నాయక్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి వి.వి.అప్పల నాయుడు, రవికుమార్, కె.నారాయణరావు,  వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.