దేశమంతా ఆజాదీకా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో భారత దేశం అన్నిరంగాలలో శక్తివంతంగా రూపొందుతోందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, ఆయుష్ మంత్రి శర్వానంద సోనోవాల్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన పేదల సంక్షేమ సమ్మేళనం (వీడియో కాన్ఫరెనన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సంక్షేమ పథకాల పై లబ్దిదారులతో సంభాషణ) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరూ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేందేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా బడుగు బలహీన వర్గాల వారికి చేయూత నందిస్తున్నట్లు చెప్పారు. తద్వారా మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారబోతోందన్నారు. అదే విధంగా విశాఖపట్నం ప్రపంచానికే గమ్యనగరంగా నిలుస్తుందన్నారు. ప్రధానికి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక అభిమానమని, రాష్ట్ర విభజన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. ఆత్మనిర్బర్ భారత్ ధ్యేయంగా ప్రధాని సారధ్యంలో అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ల్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులు, మహిళలు, యువతకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టి.శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి 8 సంవత్సరాల పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కేంద్రం అందిస్తున్న రూ.6 వేలకు రాష్ట్రప్రభుత్వం మరో రూ.7 వేలు కలిపి మొత్తం రూ. 13 వేలు రైతుభరోసా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులకు ఆర్ధికంగా లబ్ది చేకూరుతుందన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం వారు వ్యవసాయానికి అప్పు చేయనవసరం లేకుండా ప్రభుత్వమే రైతుకు పెట్టుబడికి అందజేస్తున్నట్లు తెలిపారు.
తరువాత ప్రధాన మంత్రి సంక్షేమ పథకాల మూలంగా లబ్ది పొందిన మహిళలు తమ అనుభవాన్నితెలియజేస్తూ మాట్లాడారు. తమకు అందిన పథకం ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందినదీ తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు, శాసన మండలి సభ్యులు పి.వి.మాధవ్,
అనంతరం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాని పాల్గొన్న కార్యక్రమం ప్రసారాన్ని అందరూ విక్షించారు. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి అవాజ్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పధకాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల లబ్దిదారులతో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మాట్లాడారు. జగనన్న రైతుభరోసా (పి.ఎం.కిసాన్ యోజన) అనకాపల్లి జిల్లాకు సంబంధించి రూ. 43 కోట్ల, 45 లక్షల చెక్కును, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రూ.4కోట్ల 62 లక్షల చెక్కును ఆయా జిల్లాల మహిళా రైతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి డాక్టర్ బి.వి.సత్యవతి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర, సునీల్ దేవ్ ధర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పోర్టు ఛైర్మన్ రామ్మోహన్ రావు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు డాక్టర్ ఏ.మల్లికార్టున, రవి పట్టన్ శెట్టి, జాయింట్ కలెక్టర్లు కె.ఎస్.విశ్వనాధన్, కల్పనాకుమారి జివియంసి కమిషనర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.