ప్రమాదాల నివారణే ప్రథమ లక్ష్యం


Ens Balu
3
Srikakulam
2022-05-31 15:11:05

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రమాదాలను నివారించడమే ప్రథమ లక్ష్యంగా భావించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్.హెచ్.ఏ.ఐ, ఆర్ అండ్ బి మరియు పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ప్రమాదాల నివారణకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేసారు. ఆర్ధికపరమైన సమస్యలుంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అంతిమంగా ప్రమాదాల నివారణే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రహదారి భద్రతా జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు గల జాతీయ రహదారిలో 48  బ్లాక్ స్పాట్ పాయింట్ల ( ప్రమాదాలు జరిగే ప్రాంతం ) వద్ద తగిన చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో తెలియజేయడం జరిగిందన్నారు. వీటిపై ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారని, అయినప్పటికీ రావివలస, తాడివలస, అదపాక జంక్షన్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వీటితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇల్యూమనేషన్ తో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరగా, అవి తమ పరిధిలో లేవని ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు తేల్చిచెప్పడంతో వీటిపై పై అధికారులకు తెలియజేసి వారం రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు తీసుకున్న చర్యలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో గల బ్లాక్ స్పాట్ పాయింట్లలో ఇప్పటికే పూర్తిచేసిన పనులతో పాటు ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు జరిగే  అవకాశమున్నందున వాటిని కూడా గుర్తించి ఎన్.హెచ్.ఏ.ఐ,  ఆర్ అండ్ బి మరియు పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను వేసుకొని ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ముందుకు సాగాలన్నారు. వీటిపై సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్ని సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్న అంతిమంగా అందరి లక్ష్యం ప్రమాదాల నివారణే కావాలని కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీతో పాటు మండల స్థాయిలో కూడా రహదారి భద్రతా కమిటీ ఉంటే మరిన్ని ప్రమాదాలు నివారించేందుకు అవకాశముంటుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్ ను ఆదేశించారు.

          జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక మాట్లాడుతూ జిల్లాలో పైడి భీమవరం నుండి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిలో గల బ్లాక్ స్పాట్ పాయింట్లతో పాటు అదనపు ప్రదేశాల్లో కూడా హైమాట్స్ లైటింగ్, ఇల్యూమనేషన్, హై స్పీడ్ బోర్డులు, సి.సి కెమెరాలు అవసరమై ఉన్నాయన్నారు. అలాగే జాతీయ రహదారిలో గల సి.సి కెమెరాలను జిల్లా పోలీసు కేంద్రానికి అనుసంధానం చేయగలిగితే అధిక వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించవచ్చని, తద్వారా వాటిపై చర్యలు తీసుకునే అవకాశముందన్నారు. అదనపు బ్లాక్ స్పాట్స్ వద్ద అవసరమైన చర్యలు ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు చేపట్టేలోగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున వీలైనంత త్వరగా ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే స్వచ్ఛంధ సంస్థల తోడ్పాటు, సిఎస్ఆర్ నిధుల ద్వారా వాటిని చేపట్టవచ్చని సూచించారు. శ్రీకాకుళం నగరపరిధిలోని పసగాడ మిల్లు జంక్షన్, ఏడు రోడ్ల జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సిగ్నల్ లైట్లు అలాగే కృష్ణాపార్కు, బలగ, భైరివానిపేట వద్ద స్పీడ్ బ్రేకర్స్, ఎల్లో బ్లింకర్స్ అవసరమై ఉన్నాయని యస్.పి తెలియజేసారు. ఇవన్నీ నగరపాలక సంస్థ పరిధిలోనివి అయినందున నగరపాలక సంస్థ నిధులతో వీలైనంత త్వరగా ఏర్పాటుచేయాలని కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషును ఆదేశించారు.

సామాజిక  కార్యకర్త  డా. పి.దేవభూషణరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో పోలీసు వ్యవస్థ ఉందని వారిని ఉపయోగించుకొని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించగా, జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో 693 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని, అయితే ఇందుకు వారిని ఉపయోగించుకునే అవకాశం లేదని ఎస్.పి స్పష్టం చేసారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టి.పి.విఠలేశ్వర్, ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, ఎన్.హెచ్.ఏ.ఐ డెప్యూటీ మేనేజర్ సిహెచ్.సతీష్, రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కె.కాంతిమతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి, పలాస మునిసిపల్ కమీషనర్ టి.రాజగోపాలరావు, ఎస్.డి.పి.ఓ ఎం.శివరామిరెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సమన్వయకర్త్ కె.సత్యనారాయణ, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్, స్వీప్ రమణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.