దేశంలోనే అతి శక్తివంతమైన నారసింహ క్షేత్రం సింహాచలమని, భక్తులు కోరిన కోరికలు తీర్చే సింహాద్రి నాథుడు ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన స్వామిగా విరాజిల్లుతున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కొనియాడారు. సింహాచలంలో బుధవారం కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన ధ్వజస్తంభానికి శారదా పీఠాధిపతి సమక్షంలో అర్చక స్వాములు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామి స్వయంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం శారదా పీఠాధిపతి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోనే అనేక నారసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహ ,నారసింహ అవతారాల కలయిక ఒక్క సింహాచలంకి మాత్రమే పరిమితం అన్నారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్ తో పాటు ఎన్నో రాష్ట్రాల భక్తులు సింహాద్రి నాధుడును దర్శించుకోవడానికి నిత్యం తరలివస్తారని చెప్పారు. వారందరికీ ఆలయ వర్గాలు మెరుగైన సదుపాయాలు కల్పించడం శుభపరిణామ మని చెప్పారు. కొన్ని నరసింహ క్షేత్రాల్లో శైవ ఆలయాలు కూడా ఉన్నాయని దీని వల్ల ఒకవైపు నారసింహుడు మరోవైపు పరమశివుడు ఆశీస్సులు భక్తులకు
లభిస్తుందన్నారు. హుద్ హూద్ లో ఈ శివాలయం ధ్వజ స్తంభం నేలకొరిగిందని మంచి శుభమూహూర్తము లో పూజలు జరిపి తిరిగి ప్రతిష్టించడం సంతోష దాయకమన్నారు. ఆపై మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈఈ శ్రీనివాసరాజు డిఈఓ రాంబాబు ఇంజనీరింగ్ అధికారులు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు దొడ్డి రమణ, దినేష్ రాజు, సువ్వడ శ్రీదేవి ,శ్రీదేవి వర్మ రాజేశ్వరి, నిర్మల, సంపెంగ శ్రీనివాసరావు రాధా ,చందు యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.