నైపుణ్యతతో కూడిన విద్య ద్వారానే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు త్వరితగతిన లభిస్తాయని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలని, ప్రస్తుత సమాజ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులను తీర్చి దిద్దాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పాత పద్ధుతులనే అనుసరిస్తున్నామని, దీని వల్ల ప్రగతి కుంటుపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం తర్వాత చెప్పుకోదగ్గ శుభపరిణామాలు ఏమీ చోటుచేసుకోలేదని మనమందరం సంప్రదాయక పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నామనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. నేటి తరం యువత విభిన్నంగా ఆలోచించాలని... ఉత్తమ ఫలితాలు అందుకోవాలని సూచించారు. రూ.70 లక్షలు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కేటాయించిన ఆయన స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్కిల్ డెవలెప్మెంట్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.20 లక్షలతో జిల్లాకు కేటాయించిన ప్రత్యేక అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డిగ్రీలు, సర్టిఫికేట్లు ప్రధానం కాదని.. నైపుణ్యం అవసరమని, ప్రస్తుత సమాజంలో ఉపాధి రంగంలో స్థిర పడడానికి ఉపయోగపడే చదువులను అభ్యసించాలని సూచించారు. ఉద్యోగానికి లేదా స్వయం శక్తితో ఎదగడానికి ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. 1966లో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పరిణామం ఏమీ లేదని, కావున నేటి తరం యువత కొత్తగా ఆలోచించి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఇప్పుడు 98 శాతం విద్యార్థులు డిగ్రీలు పాస్ అయిపోతున్నారని, కానీ నాణ్యత ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేం చదువుకొనే రోజుల్లో కేవలం 1 శాతం మాత్రమే పాస్ అయ్యేవారని, ఇప్పటి పరిస్థితి దానికి భిన్నంగా ఉందని గుర్తు చేశారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఆలోచించి నూతన సంస్కరణలకు నాంది పలకాలని సూచించారు. అలాగే ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో 13 ప్రత్యేక అంబులెన్స్‌లను అందజేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సౌమ్యులని, మంచి మనసున్న వారని అందుకే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని గుర్తు చేశారు. అన్ని రకాల ఆచార, సంప్రదాయాలు, పద్ధతులు కలగలిసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సురేష్ ప్రభు కితాబిచ్చారు.
అనంతరం స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ సురేష్ ప్రభుకి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే నిధుల కేటాయింపులో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యారని పేర్కొన్నారు. ఆర్థికంగా, నైతికంగా అన్ని వేళలా సురేష్ ప్రభు రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్నారని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. మీలాంటి వాళ్ల ప్రోత్సాహంతో రాష్ట్రంలోని యువతకు ఉత్తమ శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఎం & హెచ్ వో రణమ కుమారి, సీపీవో బాలాజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి శ్రీనివాస్, ఇతర అధికారులు, భాజపా నాయకురాలు రెడ్డి పావని, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.