ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎవి నర్సింహులు (78) కన్నుమూశారు. చినముషిడివాడలోని తన స్వగృహంలో ఆయన నిద్రలోనే కాలం చేశారు. ఆదివారం సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన ఆయన రాత్రి నిద్రపోయి మరి సోమవారం ఉదయం లేవలేదు. నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పెద్దకుమారుడు అరవింద్ తెలిపారు. కొన్నేళ్ళ క్రితం భార్యను కొల్పోయిన నర్సింహులు తన కుమారులు అరవింద్, బాలాజీలతో కలిసి ఉంటున్నారు. వివాహిత అయిన కుమార్తె ఒడిస్సాలో ఉంటున్నారు. సమాచార శాఖలో ఏపీఆర్‌వో నుంచి ఏడీ వరకు ఎదిగిన ఆయన విజయనగరంలో చాలా కాలం పనిచేశారు. అప్పట్లో డెక్కన్ క్రానికల్‌కు ప్రత్యేక వార్తలు రాసి పేరు గాంచారు. అత్యంత సౌమ్యునిగా, వివాద రహితునిగా పేరుగాంచిన నర్సింహులు మృతి పట్ల పలువురు అధికారులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు. వార్తల పట్ల అవగాహన, సమాచార శాఖలో ప్రతిభ చూపిన నర్సింహులు మృతి తమకు వ్యక్తిగతంగా చాలా తీరని బాధను మిగిల్చిందని విశ్రాంత సమాచార అధికారులు పి. గోవిందరావు ఆర్.త్యాగరాజు, పి.వెంకటప్పారావు, ఏ.బాబ్జి, డిడి మణిరామ్, డిపిఆర్ఓలు గోవిందరాజులు సాయిబాబా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా నర్సింహులు భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం చినముషిడివాడ శ్మశానవాటికిలో కుమారుడు అరవింద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు , బంధువులు హాజరై తుది వీడ్కోలు పలికారు.