భారత తపాలా శాఖ ఆద్వర్యంలో జూలై 1 నుండి అక్టోబర్ 31 వరకు "ధాయ్ అఖర్" పేరిట "విజన్ ఫర్ ఇండియా 2047" అనే అంశంపై జాతీయ స్థాయి లెటర్ రైటింగ్ కాంపిటిషన్ ను నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.కాంతారావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనువారు తమ ఉత్తరములను ఇంగ్లీష్/తెలుగు/హిందీ భాషలలో రాయవచ్చని అన్నారు. వాటిని "సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం - 532 001 నకు అక్టోబర్ 31లోగా పంపాలని కోరారు. అభ్యర్థులు పంపే ఉత్తరములపై " ఎంట్రీ ఫర్ దాయ్ అఖర్ 22-23"అని వ్రాయవలెనని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్వలప్స్ పంపేవారు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కాంపిటిషన్ రాష్ట్రీయ మరియు జాతీయ స్థాయిలో నిర్వహించ బడుతుందని,రాష్ట్రస్థాయిలో గెలుపొందిన ప్రథమ విజేతకు రూ25వేలు, ద్వితీయ విజేతకు రూ.10వేలు, తృతీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి విజేతకు రూ.50వేలు, ద్వితీయ విజేతకు రూ25వేలు, తృతీయ విజేతకు రూ.10వేలు నగదును అందజేయబడుతుందని స్పష్టం చేశారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ ఉత్తరములను అక్టోబర్ 31లోగా పంపించాలని, ఆ తదుపరి వచ్చిన ఉత్తరములు స్వీకరించబడవని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.ఆసక్తి గలవారు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించ వచ్చని, అదనపు సమాచారం కొరకు www.appost.in వెబ్ సైట్ ను పరిశీలించుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.