అంతా నాఇష్టం.. నేనే యాక్టింగ్ జెడ్పీచైర్మన్


Ens Balu
23
Visakhapatnam
2022-06-25 09:06:34

అంతా నా ఇష్టం..నేనే యాక్టింగ్ జెడ్పీ చైర్మన్.. మీకు తెలియదా..చైర్మన్ కు ఏం తెలియదు.. తెలియడానికైనా జిల్లా పరిషత్ లోనూ, పంచాయతీరాజ్ శాఖలోనూ రూల్ పొజిషన్.. ఏ వింగ్ లో నుంచి ఎవరు ఎక్కడెక్కడికి వస్తారు..ఎలా వస్తారు.. అవన్నీ మనకు తెలుసుకనుక..అవే చైర్మన్ కి చెప్పి మాట్లాడిస్తున్నాం.. ఆమెకి తెలియని విషయాలు  మనం ఎంత చెబితే ఆమెకి అంత..ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడపెడతారు.. ఆఖరికి జెడ్పీ సీఈఓ కూడా డమ్మీ.. చైర్మన్ ఫైనల్ చేసి పంపిన ఫైలుపై నామ్ కే వాస్తే సీఈఓ కూడా సంకతాలు చేయాలి.. జిల్లా పరిషత్ బదిలీల్లో కూడా ఆదాయం వచ్చే మార్గాలు మనమే చెప్పాం.. ఇంజనీరింగ్ సెక్షన్ కావాలంటే లక్ష 50వేలు.. జనరల్ సెక్షన్ కావాలంటే లక్ష, జిల్లా పరిషత్ కావాలంటే 75వేలు, కావాల్సిన రోడ్డు పాయింట్ మండలాలు కాలన్నా లక్ష ఇస్తే పనిజరిగిపోతుంది.. నేనే స్వయంగా చేయించేస్తాను.. అందుకే నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల్యు, ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖలను కూడా పక్కన పెట్టేశారు జెడ్పీ చైర్మన్.. ఆఖరికి జీవిఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ లు స్వయంగా వచ్చి చెప్పినా ఖాతరు చేయడంలేదు అంతా మన కనుసన్నన్నల్లోనే జరుగుతుంది.. ఏంటీ ఇదేదో సినిమా స్క్రిప్టు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియలో జరుగుతున్న తంతు.. ఎప్పడూ లేనివిధంగా జిల్లాపరిషత్ లో ఒక యూనియన్ నేత, చైర్మన్ పక్కనే పనిచేస్తున్న ఒక ఉద్యోగి చేస్తున్న కను సన్ననలలోనే కావాల్సిన వారికి..కాసులిచ్చిన వారికి పని జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే వీటిని జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి శుభద్ర, జెడ్పీ సీఈఓ మీడియా ముందు ఇదంతా మాపై ట్రోల్ అవుతున్న గాసిప్ ప్రచారమే అని కొట్టి పడేస్తున్నారు.

గాసిప్స్ మాత్రమే అనుకుంటే..కొత్తగా పదవిలోకి వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ కి పక్కనే వున్న సిబ్బంది, మోత మోస్తూ..అన్ని విషయాలూ చెప్పే ఆ యూనియన్ నేతలు..ఎందుకు ఏఏ విభాగాలకు చెందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ కి వస్తున్నారు..ఎందుకు వస్తున్నారు.. ఆయా విభాగాలకు రేటు ఎంత పలుకుతుంది.. దానికోసం ఏఏ శాఖల మంత్రుల లేఖలు తెస్తున్నారు..ఎవరెవరితో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు అంటే.. ఆ ఒక్కటీ అడక్కు అనే సమాధానమే వస్తున్నది. జిల్లా పరిషత్ బదిలీల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తూ వారికి కావాల్సిన వారు, డబ్బులిచ్చిన వారికే లైన్ క్లియర్ చేస్తూ.. తమది కాని సెక్షన్ నుంచి బదిలీల ఉత్తర్వులు కూడా దగ్గరుండి మరీ తయారు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగానే జిల్లా పరిషత్ బదిలీలంటే అంతా కాసులపైనే నడుస్తుంది. అలా నడిచినా కావాల్సిన ప్రదేశాలు కావాలంటే మరికొంచెం చేయి తడపాల్సిందే. మేము సత్య హరిశ్చచంద్రుల వంశానికి చెందిన వారమని చెప్పినా.. పైసా పెట్టకుండా ఏ పనీ జరగదు అది జగమెరిగిన సత్యం. అందులోనూ..చాలా కాలం తరువాత జెడ్పీ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ సీటులో కూర్చోవచడంతో.. ఆమెను మచ్చిన చేసుకొని.. ఆమె దగ్గరకు మంచి అధికారులు, సిబ్బంది రాకుండా  అడ్డుంకుంటున్నారని ఆ యూనియన్ నేతలు, చైర్మన్ దగ్గర పనిచేసే ఉద్యోగి ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తాజా పరిణాలమాలు రుజువు చేస్తున్నాయి.

అధికాపార్టీ మీడియా మీడియా గొంతు నొక్కినా..మిగిలిన మీడియా మొత్తం జిల్లా పరిషత్ లో జరిగే బదిలీల్లో జరిగే తంతును ఒక్కోరోజు ఒక్కో విధంగా బయటకు తీసుకొస్తున్నది. ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగే సమయంలో సర్వసాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి కావాల్సిన అధికారులు, సిబ్బందికి సహాయం చేస్తుంటారు. ఇలా సహాయం చేయడానికి  బదిలీల సమయంలోనే సిఫార్సు లేఖలు కూడా ఇస్తుంటారు. కానీ జిల్లా పరిషత్ లో మాత్రం  తమకు కావాల్సిన సిబ్బంది విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని స్వయంగా ఫోన్లు చేసినా..లేఖలు ఇచ్చినా..జెడ్పీ చైర్మన్ చుట్టూ వుండే పైరవీదారులు ఆమెను తప్పుదోవ పట్టించి ఎలాంటి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆ విషయం కూడా స్వయంగా కొందరు ప్రజాప్రతినిధులే మీడియాకి లీకులిచ్చి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎవరో చాలా గట్టిగా ప్రభావితం చేస్తున్నారు.. అందుకే ఆమె ఎవరు చెప్పినా..ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు..ఆమె దగ్గరఉన్నవారి మాటలు మాత్రం వింటున్నారని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం చెప్పుకొస్తున్నారు వారంతా.

ఇంత జరుగుతున్నా జిల్లా పరిషత్  లో జరుగుతున్న బదిలీల విషయంలో మాత్రం ఆ యూనియన్ నేతలు, చైర్మన్ పక్కనే పనిచేసే ఉద్యోగి మాటలు, చేసిన ప్రచారం మాత్రమే చెల్లుబాటు అవుతున్నాయి. నేరుగా ప్రజాప్రతినిధులు కలిసి చెప్పినా సదురు ఉద్యోగుల విషయంలో మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఎక్కడా తగ్గడం లేదనే ఆరోపణలున్నాయి. కాదు.. కాదు.. ఆవిధంగా చైర్మన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతున్నది. మీరు సీటులోకి రాగానే జరుగుతున్న బదిలీలు ఇపుడే మీరేంటో..మీ పవర్ ఏంటో చూపించాలన్నట్టుగానే చైర్మన్ ను పూర్తిగా మార్చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. వాస్తవానికన్నా..అబద్దానికి ఎక్కువ విలువ అన్నట్టుగా చెప్పుడు మాటలకు, కాసులతో జరిగే వ్యవహారాలకు మాత్రమే జిల్లా పరిషత్ లో పచ్చజెండా ఊపుతున్నారనే విషయం బయట గుప్పుమంటోంది. అయితే అవేమీ పట్టించుకోకుండా కావాలనుకున్న చోటుకి బదిలీ కావాలనుకున్నవారు మాత్రం మూడో కంటి తెలియకుండా బదిలీ చేయించుకుంటున్నారు. అందులోనూ జిల్లాల విభజన జరిగిన తరువాత కొన్ని ప్రాంతాలు, విభాగాల్లో పోస్టులకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉంటూ పనిచేసుకుంటూ పోదామనుకున్నవారు బదిలీల సమయంలో ఎంత అడిగితే అంతా ఇచ్చి కావాల్సిన ప్రదేశాలను కోరుకొని పనులు చేయించుకుంటున్నారు.

జిల్లా పరిషత్ లో జరుగుతున్న తంతుపైనా..చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్ లపైనా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ స్వయంగా చైర్మన్ ద్రుష్టికి తీసుకెళ్లింది. దానికి జిల్లా పరిషత్ చైర్మన్ స్పందిస్తూ..బదిలీల విషయంలో జరుగుతున్నదంతా కేవలం గాసిప్స్ మాత్రమేనని..జిల్లా పరిషత్ ఉద్యోగులు, వారి సమస్యలకే తాను పెద్ద పీట వేస్తున్నామని ఈ విషయంలో ఎవరూ తనను తప్పుదోవ పట్టించడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుంగా అటు జెడ్పీ సిఈఓ దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే..అసలు బదిలీల ప్రక్రియలో డబ్బులు చేతులు మారుతున్నాయని, యూనియన్ నేతలే స్వయంగా ఈ ప్రక్రియన దగ్గరుండి నడిపిస్తున్నారనే విషయం తనవరకూ రాలేదని చెప్పొకొచ్చారు. ఏమైనా ఆధారాలుంటే, బదిలీలకు డబ్బులిచ్చిన వారుంటే తమ ద్రుష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు(మరీ వెటకారంగా కావాల్సిన చోటుకి బదిలీ కావాల్సిన వ్యక్తి ఇచ్చిన డబ్బుల విషయం అధికారికంగా బయటకు చెబుతాడా). విశాఖపట్నం జిల్లా పరిషత్ లో జరుగుతున్న బదిలీల ప్రక్రియ మొత్తం పైసలు, పైరవీలతోనే జరిగిపోతున్నా.. అటు జిల్లా పరిషత్ చైర్మన్, ఇటు సిఈఓలు ఏమీ జరగడం లేదని చెప్పడం..మరోపక్క యాక్టింగ్ చైర్మన్ పేరుతో జరుగుతున్న కలెక్షన్లు.. ప్రజాప్రతినిధులే స్వయంగా తాము చెప్పినా..ఆమె వినడం లేదనే ప్రచారం ఇపుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి..ముందు ముందు జిల్లా పరిషత్ లో ఇంకెన్ని సిత్రాలు చోటుచేసుకుంటాయనది..!