నూతన పంధాలోకి వెళ్లి..ఆర్ధికంగా ఎదగాలి


Ens Balu
8
Paderu
2022-06-28 14:37:45

నూతన విధానాలను అవలంబించి ఆర్ధికంగా ఎదుగుదామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయం సహాయక బృందాలకు పిలుపునిచ్చారు. మంగళవారం పాడేరు ఐటిడిఎ సమావేశమందిరంలో సూక్ష్మ ఆహార శుద్ధ పరిశ్రమలు, క్రమబద్ధీకరణ అనే అంశంపై జిల్లా అధికారులకు, స్వయం సహాయక సంఘాలకు నిర్వహించిన వర్క్ షాపులో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నప్పటికీ అవగాహనా లోపంతో లబ్ధిదారులు అందుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.  పి.ఎం.ఎఫ్.ఎం.ఇ  పథకం క్రింద ఒక లక్ష రూపాయలు నుండి ఒక కోటి రూపాయల వరకు, వ్యక్తిగత, బృందాలుగా రుణాలు మంజూరు చేస్తారని,  దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐతే ఈ పథకంలో ఆహార ఉత్పత్తులు గ్రేడింగ్, ప్యాకింగ్, శుభ్రపరచటం లాంటి అవసరాలకు ఋణం అందించటమే కాకా మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారని వివరించారు. యూనిట్ స్థాపిస్తే 55 శాతం బ్యాంకు ఋణం లభిస్తుందని, 35 శాతం సబ్సిడీ ఉంటుందని, కేవలం 10 శాతం లబ్ధిదారు వాటా గ చెల్లిస్తే సరిపోతుందని,  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వివరించారు. ఈ పథకం క్రింద ప్రతి మండలం నుండి కనీసం రెండు యూనిట్ల స్థాపనకు వెలుగు సిబ్బంది స్వయం సహాయక బృందాలకు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. 
     ఐటిడిఎ పిఓ రోణంకి గోపాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, ఉత్పత్తులకు కొదవ లేదని, వాటికి విలువ పెంచి అమ్మకం చేయటం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. కాఫీ, మిరియాలు, అల్లం, పసుపు విస్తారంగా లభిస్తున్నాయని, వాటి నుండి కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేసి అమ్మటం ద్వారా లాభాలు పొందవచ్చని, అందుకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ సౌకర్యాలకు సహకారం అందిస్తామన్నారు. 
       ఈ కార్యక్రమంలో విజయవాడ నుండి విచ్చేసిన ఎపి ఫుడ్ పోసెస్సింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ మారుతి పలు అంశాలపై అవగాహన కల్పించారు. 
          ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి మురళి, విశాఖపట్నం ఎపిఎంఐపి సహాయ సంచాలకులు రహీం, జిల్లా వ్యవసాయ అధికారి బిఎస్ నంద్ , బ్యాంకర్లు, స్వయంగా సహాయక బృందాల సభ్యులు వెలుగు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.