రైతుల సంక్షేమం కంటే మిల్లర్లు ముఖ్యం కాదు..
Ens Balu
3
ఆత్మకూరు
2020-09-19 15:52:17
రాష్ట్ర పరిశ్రమలు, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరులో పర్యటించి సంగం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీచేశారు. శనివారం ధాన్యం కొనుగోలు జరుగుతున్నతీరును పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, నాణ్యత ప్రమాణాల పరంగా రైతులకు మేలుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాకే ప్రత్యేకమైన ఎడగారు పంట ధాన్యం కొనుగోలులో ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే మిల్లర్లతో సమీక్ష నిర్వహించి అన్ని విషయాలపై మాట్లాడామని ప్రభుత్వానికి సహకరిస్తామని వారు చెప్పినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఒక వేళ అలా జరగని పక్షంలో ప్రభుత్వపరంగా కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడబోమన్నారు. సంగం మండలంలో ఈ ఏడాది సుమారు 10వేల ఎకరాలలో వరి పంట పండిందని మండల వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. తొలిసారిగా నెల్లూరు - 3354 రకం 3వేల ఎకరాలలో రైతులు పండించారన్నారు. ప్రభుత్వం పుష్కలంగా నీరు ఇవ్వడం వలన పంట దాదాపు రెట్టింపుగా దిగుబడి వచ్చిందని ఓ రైతు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ పంటను అమ్ముకోవడంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం కూడా సమస్యగా పరిణమించిందని రైతులు వాపోయారు. మిల్లర్లను నియంత్రించే చట్టం చేసి అన్నదాతలను ఆదుకోవాలని సంగం మండల రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. అందుకు సమాధానంగా మంత్రి గౌతమ్ రెడ్డి ఏ మాత్రం ఆందోళన చెందవద్దని బదులిచ్చారు. అవసరమైతే రైతన్నల సమస్యల పరిష్కారానికి అడ్డుపడే ఏ వ్యవస్థనైనా తొలగించి..మరో వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. కష్టాలు తీర్చే ప్రభుత్వం..అవసరమయితే ఆ కష్టాలను సృష్టించే వారిపై చర్యలకు ఎంతదూరమైనా వెళతామని మంత్రి పేర్కొన్నారు.