వైద్యకళాశాల ఏర్పాట్లు పరిశీలన..


Ens Balu
2
Vizianagaram
2022-07-01 14:02:14

విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం చేస్తున్న ఏర్పాట్లపై వైద్య విద్య శాఖ డైరెక్టర్ డా.రాఘవేంద్ర రావు జిల్లాలో శుక్రవారం పర్యటించారు. నగరంలోని మహారాజ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకొని అక్కడ ఆసుపత్రిలో ప్రధమ సంవత్సరం వైద్య విద్యార్ధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు లతో మాట్లాడారు. వచ్చే ఏడాది 2023-24 నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో  ప్రధమ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నందున ఆ విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలపై దృష్టి సారించామని వైద్య విద్య డైరెక్టర్ చెప్పారు. ఆ మేరకు వసతులు జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనాటమీ, ఫిజియాలజి, బయో కెమిస్ట్రీ తదితర సబ్జెక్టు లకు సంబంధించి సౌకర్యాలు అవసరమని డైరెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో వున్న సౌకర్యాలు, అదనంగా కల్పించే వసతులపై మ్యాప్ ద్వారా డైరెక్టర్ కు వివరించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డ్ లను డైరెక్టర్ సందర్శించారు.

గాజుల రేగ ప్రాంతంలో నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాన్ని కుడా వైద్య విద్య డైరెక్టర్ పరిశీలించారు. జోరుగా కురుస్తున్న వర్షంలోనే నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులని పరిశీలించారు. పనులపై వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్య ప్రభాకర్ వివరించగా సంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో నిర్మాణంలో వున్న కొత్త వైద్య కళాశాలలన్నింటిలో ఇక్కడే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఇదే సరళిని కొనసాగిస్తూ పనులు మరింత వేగవంతం చేయాలని ఇ.ఇ. సత్య ప్రభాకర్ కు సూచించారు.