భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం వీరుడు 'విప్లవ జ్యోతి' అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సముపార్జన కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం రాజమండ్రి పి.వి. నరసింహారావు పార్క్ (గోదావరి బండ్) వద్ద అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలు జీవించినప్పటికీ స్వాతంత్ర్య సుముపార్జనకు ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ, ఆత్మ విశ్వాసం, దైర్యసాహాసాలు ఎనలేనివన్నారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఆదేశాలు జారిచేశారన్నారు. రాష్ట్రంలో ఆయన పేరు ఒక జిల్లా పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు ఆ మహనీయుని జయంతి జరుపుకోవడంతోపాటు భావితరాలకు స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన చొరవ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు భావితరాలకు చెప్పే విధంగా
ఫోటో ప్రదర్శన శాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ అల్లూరి 125 జయంతోత్సవం చిరస్మరణంగా ఉండే విధంగా గోదావరిపై ఉన్న పాత రైలు వంతెనకు లేదా అల్లూరి పోరాటానికి ముఖద్వారంగా ఉన్న మధురపూడి విమానాశ్రయానికి గాని అల్లూరి పేరు పెట్టాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరంకు అల్లూరి చరిత్ర ముడిపడి ఉందని అందువల్ల అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం నిర్ణయించిందని ఆ విజ్ఞాన కేంద్రంలో అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన అపురూపమైన తైలవర్ణ చిత్రాలు, సాహిత్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన కలెక్టర్ ని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా విభూది బ్రదర్స్ ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ, అల్లూరి వేషధారణ సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కే. దినేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, టీకే విశ్వేశ్వరరెడ్డి, జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యులు, యర్ర ఉమామహేశ్వరరావు, ఎస్ఎస్ రాఘవేంద్ర, శ్యామల, పార్వతి,
యర్ర కృష్ణ కుమార్, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను( ఈఎన్ఎస్ బాలు) తదితరులు పాల్గొన్నారు.