అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు


Ens Balu
4
Parvathipuram
2022-07-05 08:37:21

రైతులకు  విత్తనాలు,  ఎరువులు పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలని, అక్రమాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్  తెలిపారు.  మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ హాలునందు  ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులతో  జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో ఎరువులు పంపిణీ చాలా ముఖ్యమని తెలిపారు. ఎరువులు కేటాయింపులకు ప్రణాళిక ఉండాలని, జిల్లా యంత్రాంగం నుండి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే కేటాయింపులు, రవాణా చేయాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. డీలర్లకు 50శాతం, మార్క్ ఫెడ్ కు 50 శాతం వంతున సరఫరా చేయాలని తెలిపారు. జాయింటు కలెక్టరు నుండి ఎరువుల కేటాయింపులకు సంబంధించి ఆమోదం తీసుకోవాలని తెలిపారు. ఎరువులు సరఫరాపై సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. మండలంలో అవసరాన్ని బట్టి కేటాయింపులు ఉండాలనితెలిపారు. ఎరువులు  అంతర్ జిల్లాల, అంతరాష్ట్ర రవాణా నిషేదమని, డీల్లర్లు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, అమ్మకాలు, నిల్వలకు తేడాలు రాకూడదని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 అనంతరం వ్యవసాయ, అనుబంధ శాఖలైన ఉద్యానశాఖ, పశుసంవర్థక,మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ శాఖ మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తూ విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ జరగాలన్నారు.  విత్తనాలు, ఎరువులు పంపిణీపై ప్రజలనుండి, ప్రజా ప్రతినిధులనుండి పిర్యాదులు రాకూడదన్నారు. గ్రామాలు, రైతు భరోసా కేంద్రం వారీగా డిమాండు, సప్లయిపై నివేదిక తయారుచేసుకొని, దాని ప్రకారం పంపిణీ చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, ఎరువులు కొరత వచ్చిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు తగినన్ని నిల్వలు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైనన్ని  కంది, మినుము విత్తనాలు పంపిణీ చేసి వాటి వాడకంపై పర్యవేక్షణ చేయాలని అదికారులకు తెలిపారు. కౌలు రైతులకు రుణ అర్హత  కార్డులు అందజేయాలన్నారు. బ్యాంకు లింకేజీ కాని రైతుల బ్యాంకు అక్కౌంటులు ఆధార్ తో లింక్ చేసి వారికి ప్రభుత్వ పధకాలు అందేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు.