ప్రభుత్వ భవన నిర్మాణ విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న ప్రభుత్వ భవన నిర్మాణపు పనులపై మంగళవారం మండల తహశీల్దారులు, ఎం.పి.డి.ఓలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధుల కొరతతో నిర్మాణాల్లో జాప్యానికి కారణమని భావించి నిధులను మంజూరుచేసామని అన్నారు. నిధుల సమస్య ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకు రావాలని, నిధుల కొరతను అధిగమించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ కు కోటి యాభై లక్షల రూపాయల చొప్పున మూడు కోట్లు రూపాయలను వడ్డీ నిధుల నుండి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నిధులు విడుదల పిదప కూడా నేటికీ పనులను చేపట్టక పోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ తరపున చేపడుతున్న భవన నిర్మాణ పనులపై కలెక్టర్ మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఇంజినీర్లు పనుల పురోగతి పై అందించిన నివేదికలు సంతృప్తి కారణంగా లేవని, ఇందుకు ప్రధాన కారణం చేపడుతున్న పనులపై పర్యవేక్షణ లోపమని అన్నారు. భవన నిర్మాణ పనుల అమలుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. నిధులు మంజూరు చేసి మూడురోజులు అయినప్పటికీ ఎటువంటి పనులు ప్రారంభించక పోవడం పట్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ తేల్చిచెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు భవన నిర్మాణాలపై తరచూ సమీక్షలు నిర్వహించి ప్రగతి పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రగతిలో జిల్లా వెనుకబడి ఉందని వెంటనే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శ్రీకాకుళం, టెక్కలి కార్య నిర్వాహక ఇంజినీర్లు టెలీ కాన్ఫరెన్స్ లో రెస్పాన్స్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన నిధులతో ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని, పనుల నిర్వహణకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు. టెక్కలి డివిజన్ లో చేపట్టిన భవన నిర్మాణ పనులపై మాట్లాడుతూ ఆన్లైన్ లో పూర్తిగా సున్న ప్రగతి ఉండడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన 101 పనులకు సంబంధించి పనుల్లో పురోగతి కనిపించాలని, పనుల నిర్వహణపై కథలు చెప్పడం మాని, పురోగతి చూపించాలని ఆదేశించారు. గత 4 వారాల నుండి బిల్లులు చెల్లింపులు చేయడం జరుగుతుందని, మిగిలిన పనులు కూడా పూర్తి చేసిన వెంటనే బిల్లులు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని డి.ఇలు,ఎ.ఇలు, యం.పి.డి.ఓ లు తహశీల్దార్లు, ఇంజనీరింగ్ సహాయకులు గమనించాలని అన్నారు. గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వెల్నెస్ సెంటర్స్ ఎక్కడ భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదో, బిలో బేస్మెంట్ భవనాలు ఉన్నయో అన్నింటిపై చర్యలు చేపట్టి, రానున్న రెండు రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. జరుగుతున్న పనులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయని, ఎవ్వరూ ఎటువంటి అపోహలకు గురికావద్దన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్.ఇ పంచాయతీరాజ్ శాఖ, శ్రీకాకుళం, టెక్కలి ఈ ఈ లు, మండల తహశీల్దారులు, ఎం.పి.డి.ఓలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.